బాత్రూమ్స్ కడిగి, బ్యాంక్ మేనేజర్ స్థాయికి ఎదిగి.. హ్యాట్సాఫ్ ప్రతీక్ష!

కలం, వెబ్ డెస్క్: చేతిలో చీపురు పట్టి బ్యాంక్ ఫ్లోర్లను శుభ్రం చేసిన ఓ సాధారణ మహిళ, అదే బ్యాంక్‌లో అత్యున్నత స్థాయి అధికారిగా ఎదిగారు. పట్టుదల, కఠోర శ్రమ ఉంటే జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొని విజయం సాధించవచ్చని నిరూపించారు ప్రతీక్షా తొండ్వాల్కర్ (Pratiksha Tondwalkar). స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో స్వీపర్‌గా కెరీర్ ప్రారంభించి, నేడు అదే బ్యాంక్‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హోదాకు చేరుకుని దేశానికే ఆదర్శంగా నిలిచారు.

బాల్యంలోనే చదువుకు దూరం

1964లో పూణేలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ప్రతీక్షకు చిన్నతనం నుంచే చదువుకోవాలనే కోరిక బలంగా ఉండేది. కానీ ఆమె 7వ తరగతి చదువుతున్న సమయంలోనే తండ్రి చదువు ఆపేసి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఆమె చదువుకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని ఉపాధ్యాయురాలు బతిమాలినా తండ్రి వినలేదు. ఫలితంగా 17 ఏళ్ల చిన్న వయసులోనే ముంబైలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో బుక్‌బైండర్‌గా వ్యక్తితో పెళ్లి చేశారు.

20 ఏళ్లకే తీరని లోటు

వివాహమైన కొద్ది రోజులకే ప్రతీక్ష ఓ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే, ఆమె వయసు 20 ఏళ్లు ఉన్నప్పుడు ఒక రోడ్డు ప్రమాదంలో భర్త మరణించారు. చేతిలో కనీస విద్యార్హత లేదు. రెండేళ్ల కొడుకును సాకాల్సిన బాధ్యత.. జీవితం ఒక్కసారిగా చీకటిమయమైంది. ఆ పరిస్థితుల్లో భర్తకు రావాల్సిన బకాయిల కోసం ఆమె ముంబైలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లారు. అక్కడ తనకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇవ్వాలని బ్యాంకు అధికారులను వేడుకున్నారు. మొదట 65 రూపాయల జీతానికి స్వీపర్‌గా చేరింది. ఆ తర్వాత క్లర్క్‌గా పదోన్నతులు పొందారు. 1993లో ప్రమోద్ తొండ్వాల్కర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆయన ప్రోత్సాహంతో బ్యాంకింగ్ ఆఫీసర్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. ఆపై తన అంకితభావంతో ట్రైనీ ఆఫీసర్ నుండి స్కేల్ 4 ఆఫీసర్‌గా, ఆ తర్వాత చీఫ్ జనరల్ మేనేజర్‌గా అంచెలంచెలుగా ఎదిగారు. ఒకప్పుడు ఏ బ్యాంకులోనైతే ఆమె గదులను కడిగిందో, సరిగ్గా అదే బ్యాంక్ ఆమెకు అత్యున్నత గౌరవాన్ని అందించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>