హైదరాబాద్‌ ‘సిక్సర్ల’ ధాటికి కుప్పకూలిన పంజాబ్‌.. కూపర్ పోరాటం వృథా!

కలం, వెబ్ డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బౌండరీల వర్షం కురిపిస్తూ పంజాబ్ కింగ్స్‌ను బెంబేలెత్తించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు సాధించిన ఎస్‌ఆర్‌హెచ్, అనంతరం పంజాబ్‌ను 202 పరుగులకే కట్టడి చేసి 33 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అభిషేక్ శర్మ కేవలం 13 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 35 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ట్రావిస్ హెడ్ (38) కూడా తన శైలిలో మెరుపులు మెరిపించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 55 పరుగులతో మెరిస్తే, హెన్రిచ్ క్లాసెన్ 43 బంతుల్లో 69 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇక చివర్లో నితీష్ కుమార్ రెడ్డి కేవలం 13 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి స్కోరు బోర్డును 235కి చేర్చాడు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ తన పదునైన బౌలింగ్‌తో పంజాబ్ ఓపెనర్లను పెవిలియన్ పంపాడు. ప్రియాన్ష్ ఆర్య (1), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (3), శ్రేయస్ అయ్యర్ (5) ఇలా వరుసగా క్యూ కట్టడంతో పంజాబ్ 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్టోయినిస్ (28), సూర్యాన్ష్ షెడ్జ్ (25) కాసేపు పోరాడినా అది విజయానికి సరిపోలేదు.

ఒకవైపు వికెట్లు పడుతున్నా కూపర్ కానోలీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 59 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇతని సెంచరీ పంజాబ్ స్కోరును 200 దాటించినప్పటికీ, మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లేకపోవడంతో ఓటమి తప్పలేదు. హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమిన్స్, శివాంగ్ కుమార్ చెరో రెండు వికెట్లు తీసి పంజాబ్ నడ్డి విరిచారు. నితీష్ రెడ్డి, మలింగ, సాకిబ్ హుస్సేన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>