కలం, వరంగల్ బ్యూరో : గ్రేటర్ వరంగల్ (Warangal) మహానగరపాలక సంస్థ పాలకవర్గానికి వీడ్కోలు సందర్భంగా ఆత్మీయ సమావేశం వరంగల్ నగరంలోని వెంకటేశ్వర గార్డెన్స్‌లో ఇవాళ రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఐదేళ్లలో వరంగల్ నగరం అభివృద్ధి దిశగా ముందడుగు వేసిందని తెలిపారు. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, టెంపుల్ టూరిజం, ఈకో టూరిజం ప్రోత్సాహం వంటి కీలక కార్యక్రమాలు నగర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేశాయని పేర్కొన్నారు. అలాగే ప్లాస్టిక్ నియంత్రణ, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడే దిశగా చర్యలు తీసుకున్నామని అన్నారు.
ఈ సందర్భంగా మహిళల పాత్రను ప్రస్తావిస్తూ సమాజంలో మహిళలు సగభాగం ఉన్నారని, రాజకీయాల్లో వారి భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం ద్వారానే నిజమైన నాయకత్వం సాధ్యమవుతుందని సూచించారు. ఎన్నికల సమయంలో మాత్రమే కాదు… ఎప్పుడూ ప్రజలతో ఉండే వారే నిజమైన నాయకులని మంత్రి స్పష్టం చేశారు. ప్రజాసేవ పట్ల అంకితభావంతో పనిచేసిన మేయర్, కార్పొరేటర్లను అభినందిస్తూ.. భవిష్యత్తులో కూడా ఇదే సేవా స్పూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
మేయర్ గుండు సుధారాణి తన పదవీకాలం ముగింపు సందర్భంగా భావోద్వేగపూర్వకంగా మాట్లాడారు. గత ఐదేళ్లుగా మేయర్‌గా సేవ చేసే అవకాశం లభించడం తన జీవితంలో గొప్ప గౌరవమని పేర్కొన్నారు. ఈ బాధ్యత ప్రజలు నాపై ఉంచిన విశ్వాసానికి ప్రతీక అని అన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో నగర అభివృద్ధి దిశగా స్మార్ట్ సిటీ పనులు, రహదారుల మెరుగుదల, మురుగు కాలువలు, తాగునీటి సదుపాయాల విస్తరణ వంటి అనేక కీలక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల సహకారం, సహచర కార్పొరేటర్లు, అధికారుల అంకితభావమే ఈ పురోగతికి కారణమని అభిప్రాయపడ్డారు. సాధారణ గృహిణిగా ప్రారంభమైన తన ప్రయాణం ప్రజాసేవ వైపు దారితీసిందని, ప్రతి దశలో బాధ్యతలను నెరవేర్చడం తనకు గొప్ప అనుభవాన్ని ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో వరంగల్ అభివృద్ధికి మరింత వేగం వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం పలువురు కార్పొరేటర్లు తమ పదవీకాలం ముగింపు వేళ గత ఐదేళ్ల అనుభవాలను పంచుకున్నారు. ప్రజాసేవలో ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాలను గుర్తుచేసుకున్నారు. ప్రజల సహకారం, అధికారుల మద్దతుతో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలయ్యాయని వారు పేర్కొన్నారు. అనంతరం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ తరపున మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులను ఘనంగా శాలువాలతో సత్కరించి మెమోంటోలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్. నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయ్, డా. సత్యశారద, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, డిప్యూటి మేయర్ రిజ్వాన షమీమ్ మసూద్, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

