మహబూబ్‌ నగర్‌లో రోడ్డు భద్రతకు ప్రత్యేక చర్యలు: విప్ యెన్నం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ (Mahabubnagar)) పట్టణంలో రోడ్డు భద్రత, ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణలో సమగ్ర మార్పులు తీసుకొస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని ఎన్ఐసీ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం ఎస్పీ డి.జానకి, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్‌తో పాటు పోలీస్, ట్రాఫిక్, మున్సిపల్, రోడ్డు రవాణా శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లా కేంద్రంలో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, ప్రజల భద్రత కోసం వచ్చే ఆరు నెలల్లో 750 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సీసీ కెమెరాలకు అయ్యే నిధులను ఎస్డీఎఫ్, ముడా, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తీసుకుంటామన్నారు.

రోడ్ సేఫ్టీ కో–ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు..

చిన్నపిల్లలు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, మైనర్లు వాహనాలు నడపకుండా కఠినంగా నియంత్రించాలని పోలీస్ అధికారులను విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. తల్లిదండ్రులపై కూడా బాధ్యతను నిర్ధారించే చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరం చుట్టూ ఉన్న ప్రధాన హైవేలు, బైపాస్ రోడ్లలో స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసి వేగ నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచడానికి రోడ్ సేఫ్టీ కో–ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో ఎస్పీ, నగర మేయర్, డిప్యూటీ మేయర్, ముడా ఛైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ తదితరులు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కమిటీ ప్రతి నెలా సమావేశమై రోడ్ సేఫ్టీ పరిస్థితులను సమీక్షించి, తక్షణ చర్యలు చేపడుతుందని తెలిపారు.

సమయాన్ని మించి హోటళ్లు, బార్ షాపులు నడపొద్దు..

వాహన యజమానులు, డ్రైవర్లలో బాధ్యత పెంపొందించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. తప్పకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సమయాన్ని మించి బార్ షాపులు, హోటల్స్ నడపరాదని హెచ్చరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు కోసం జిల్లా ఎస్పీ డాక్యుమెంట్ సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్న వారు రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా అవగాహన కల్పిస్తూ నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మహబూబ్ నగర్‌ను యాక్సిడెంట్ ఫ్రీ జోన్‌గా అభివృద్ధి చేయాలని సంకల్పించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>