కలం, నారాయణపేట: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా కోస్గి (Kosgi) పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. కోస్గి పట్టణంలో సర్ సీవీ రామన్ సైన్స్ మ్యూజియం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రానున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్, రాకపోకల మార్గాలు, పార్కింగ్ స్థలాలు తదితర ప్రాంతాలను ఎస్పీ డాక్టర్ వినీత్ (SP Vineeth) క్షుణ్ణంగా పరిశీలించారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలను కేటాయించాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ రాకపోకలు సాగించే మార్గాల్లో రోడ్డు ఓపెనింగ్ పార్టీలను ఏర్పాటు చేసి, రహదారులపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.
అదేవిధంగా రూఫ్‌టాప్ సెంట్రీలు, రోప్ పార్టీలు, కీలక కూడళ్లు, ముఖ్యమైన ప్రదేశాల్లో ప్రత్యేక భద్రతా బలగాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లే మార్గాన్ని ముష్రిఫా బోర్డర్ వరకు స్వయంగా పరిశీలించి, మార్గమధ్యంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. బందోబస్తు ముందస్తు ప్రణాళికతో సంబంధిత అధికారుల సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. ఎలాంటి భద్రతా లోపాలకు తావులేకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ముఖ్యమంత్రి పర్యటనను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ ఆదేశించారు.
ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో ఎస్పీతో పాటు డీఎస్పీలు నల్లపు లింగయ్య, ఎ. మహేష్, కోస్గి సీఐ సైదులు, ఆర్ఐ విజయ్ భాస్కర్, ఎస్సైలు చంద్రశేఖర్, భాగ్యలక్ష్మి రెడ్డి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

