కలం, యాదాద్రి భువనగిరి: శారీరక పరిమితులు ఉన్నా.. సంకల్పానికి మాత్రం హద్దులు లేవని భవిత కేంద్రాల విద్యార్థులు (Bhavitha Centre Students) నిరూపించారు. తమలోని ప్రతిభను చాటుకునేందుకు క్రీడా మైదానంలో ఉత్సాహంగా అడుగులు వేశారు. గెలుపు కోసం పోటీ పడటమే కాదు.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ అందరి దృష్టిని ఆకర్షించారు.
రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి భవిత కేంద్రాల క్రీడా దినోత్సవం విద్యార్థుల ఉత్సాహంతో సందడిగా సాగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Collector Anurag Jayanthi) విద్యార్థులను ఉద్దేశించి కీలక సందేశం ఇచ్చారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను కేవలం విద్యకే పరిమితం చేయకుండా క్రీడల్లోనూ సమాన అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు.
మైదానంలో అడుగుపెట్టడమే తొలి విజయం
క్రీడల్లో గెలుపోటములు సహజమని, వాటికంటే పోటీల్లో పాల్గొనడం, తమ ప్రతిభను ప్రదర్శించడం, ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించడం ఎంతో ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. సరైన శిక్షణ, ప్రోత్సాహం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఈ పిల్లలు కూడా ఉన్నత స్థాయికి చేరుకోగలరని అన్నారు.
భవిత విద్యార్థుల నుంచి పారా ఒలింపిక్స్ వరకు
అంతర్జాతీయ వేదికలపై భారత పారా ఒలింపిక్ క్రీడాకారులు పతకాలు సాధించి దేశ కీర్తిని చాటుతున్నారని కలెక్టర్ గుర్తుచేశారు. వారి విజయగాథలను వీడియోల ద్వారా భవిత కేంద్రాల విద్యార్థులకు పరిచయం చేసి, వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు. ప్రతిభ ఉన్న పిల్లలను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ అందించే దిశగా దృష్టి సారించాలని తెలిపారు.
ప్రత్యేక పిల్లలకు ప్రత్యేక ప్రోత్సాహం
జిల్లాలోని అన్ని భవిత కేంద్రాలను మరింత బలోపేతం చేసి, ప్రత్యేక విద్యా అవసరాలు కలిగిన పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడల్లోనూ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పిల్లలను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల కృషిని అభినందించారు. క్రీడా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన జిల్లా విద్యాశాఖ అధికారి, ప్రోగ్రామ్ అధికారి, భవిత కేంద్రాల ఇన్చార్జీలు, ప్రత్యేక విద్య ఉపాధ్యాయులను అభినందించారు.
విజేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థి విజేతేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి, సమ్మిళిత విద్య సమన్వయకర్త పెసరు లింగారెడ్డి, భువనగిరి మండల విద్యాధికారి సీహెచ్. రంగరాజన్, రాయగిరి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్. అండాలు, భవిత కేంద్రాల ఇన్చార్జీలు, ప్రత్యేక విద్య, క్రీడా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

