కలం, ఖమ్మం బ్యూరో: కొత్తగూడెం ప్రాంతాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్న ముర్రేడు వాగు (Murredu Vagu Retaining Wall) వరద ముప్పునకు శాశ్వత పరిష్కారం లభించింది. వాగుపై రక్షణ గోడ (రిటైనింగ్ వాల్) నిర్మాణానికి ప్రభుత్వం రూ.50.50 కోట్లు మంజూరు చేసినట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్లుగా తాను చేసిన అవిశ్రాంత కృషి ఫలితంగానే ఈ నిధులు మంజూరయ్యాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దీనికి అనుమతులు మంజూరు చేయగా, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క తక్షణమే నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ చేయడంపై ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. జనావాసాల మధ్య ప్రవహించే ముర్రేడు వాగు ఉధృతి కారణంగా శ్రీనగర్, ప్రశాంతి నగర్, సాయినగర్ ప్రాంతాల ప్రజలు ప్రతి వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. భారీ వర్షాలకు వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు నిద్రలేని రాత్రులు గడపడమే కాక, శ్మశాన వాటికలకు వెళ్లే దారులు సైతం మునిగిపోయి నరకయాతన అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు ఈ సమస్యను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.
ప్రజల కష్టాలను గుర్తించి, రిటైనింగ్ వాల్ నిర్మాణమే ఏకైక శాశ్వత పరిష్కారమని భావించి మంత్రులపై ఒత్తిడి తెచ్చి ఈ నిధులు సాధించినట్లు కూనంనేని స్పష్టం చేశారు. వాగుకు ఇరువైపులా పటిష్టమైన రక్షణ గోడ నిర్మించడం ద్వారా ముంపు ప్రాంతాల ప్రజలకు వరద భయం పూర్తిగా తొలగిపోతుందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ పనులను ప్రారంభించి, నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయిస్తామని హామీనిచ్చారు. నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికే తన ప్రాధాన్యమని ఆయన ఆ ప్రకటనలో పునరుద్ఘాటించారు.

