కలం, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం (Pocharam) గ్రామంలో ఓ పాల కల్తీ (Milk Adulteration) వ్యవహారం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ (Hyderabad) నగర వినియోగదారులకు సరఫరా చేసే పాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్, పాలపొడి కలిపి కల్తీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ రోజు ఉదయం మహేశ్వరం జోన్ ఎస్‌వోటీ, ఫ్యూచర్ సిటీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పోచారానికి చెందిన అండె శ్రీశైలం అనే పాల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో పాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో పాటు ధోల్పూర్ మిల్క్ పౌడర్ కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు వెల్లడైంది.
ఈ దాడుల్లో 100 లీటర్ల అనుమానిత కల్తీ పాలు, ఒక లీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్, కిలో బరువున్న 35 పాలపొడి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, అధికారులు పాల వ్యాపారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాలలో రసాయనాలు కలపడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. పట్టుబడిన నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్‌కు కల్తీ పాలు సరఫరా అవుతున్నట్లు గుర్తించిన నేపథ్యంలో వినియోగదారులు పాలు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

