కలం, నాగర్కర్నూల్: ఎన్హెచ్ఎం ఉద్యోగుల (NHM Employees) న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఎన్హెచ్ఎం జేఏసీ నాగర్కర్నూల్ జిల్లా ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారంతో 25వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులు మండుటెండను సైతం లెక్కచేయకుండా మండుతున్న ఎండలో కాంక్రీట్ రోడ్డుపై కూర్చొని వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు ఐక్యంగా పోరాటాన్ని కొనసాగించారు.
ఈ సందర్భంగా జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజారోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, క్రమబద్ధీకరణతో పాటు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై తమకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పందించాలని కోరారు.
ఎన్ హెచ్ ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు డా. బాలకృష్ణ మాట్లాడుతూ, ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు గత అనేక సంవత్సరాలుగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల విజయానికి వెన్నెముకగా నిలుస్తున్నారని తెలిపారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలందించిన ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఐక్యంగా, శాంతియుతంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 25 రోజులుగా మండుటెండలోనూ, అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉద్యోగులు కొనసాగిస్తున్న ఈ పోరాటానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం జేఏసీ నాయకులు హైమావతి, డా. జగన్, శ్రీనివాసులు, ప్రవీణ్, ప్రకాష్, భీముడు తదితరులు పాల్గొన్నారు.

