కలం, నిర్మల్ రూరల్ : నిర్మల్ రూరల్ మండలం డ్యాంగాపూర్ (Dyangapur) గ్రామ సమీపంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా స్థాయి గిరిజన క్రీడోత్సవాలు (Tribal Sports Meet) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని 18 పాఠశాలలకు చెందిన సుమారు 500 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన క్రీడాకారులు నవంబర్ చివరి వారంలో ఉట్నూరులో జరిగే జోనల్ స్థాయి పోటీల్లో, డిసెంబర్లో భద్రాచలంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.
పోటాపోటీగా విలువిద్య పోటీలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ అండర్-14, అండర్-17 విభాగాల విలువిద్య పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగాయి. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నిహారిక, ఏజెన్సీ డీఈఓ గోడం చందన్ పోటీలను ప్రారంభించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన విలువిద్య క్రీడాకారులు తమ నైపుణ్యంతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ప్రధానోపాధ్యాయురాలు అనూష, జిల్లా క్రీడల అధికారి బుక్యా రమేష్, ఏసీఎంఓ శివాజీ, గజ్జారాం, అనిల్, ప్రధానోపాధ్యాయులు, పీడీలు పాల్గొన్నారు.

