కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : నేటి బాలలే రేపటి బాధ్యతాయుత పౌరులని, వారి భద్రత, సంక్షేమం కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా ఎస్పీ డి. జానకి (SP Janaki) పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక–99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న బాలల భద్రత వారోత్సవాల సందర్భంగా శనివారం మహమ్మదాబాద్ మండలం నంచర్ల గేట్‌లోని పల్లవి గార్డెన్‌లో బాల పంచాయతీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో, మై ఛాయస్ ఫౌండేషన్, యంగిస్తాన్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్పీ డి. జానకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాల పెంపొందనకు బాల పంచాయతీలు సమర్థవంతమైన వేదికలుగా నిలుస్తాయని అన్నారు. పిల్లలలో ఆత్మవిశ్వాసం, పట్టుదల, బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సమస్యలను విశ్లేషించి పరిష్కరించే నైపుణ్యం, జట్టు భావన, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించడంలో బాల పంచాయతీల పాత్ర కీలకమని పేర్కొన్నారు. గ్రామాలలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసేందుకు బాల పంచాయతీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బాలల భద్రత, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, బాల్య వివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి అంశాలపై బాల పంచాయతీ ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
పిల్లలను గ్రామాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో భాగస్వాములను చేయడం ద్వారా వారిలో నాయకత్వ సామర్థ్యాలు పెంపొందుతాయని, భవిష్యత్తులో సమాజానికి బాధ్యతాయుత పౌరులుగా ఎదగడానికి ఇది దోహదపడుతుందని ఎస్పీ తెలిపారు. బాల పంచాయతీ సభ్యులు గుర్తించిన సమస్యలను అధికారులు సానుకూలంగా స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. బాలల అనుకూల వాతావరణం కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీడబ్ల్యూఓ జరీనా, డిప్యూటీ డీఈవో శ్రీనివాస్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ రమణారెడ్డి, సీడబ్ల్యూసీ ఛైర్మన్ నయీముద్దీన్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ కృష్ణయ్య, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్‌స్పెక్టర్ సైదారావు, ఎమ్మార్వో మల్లికార్జున, ఎంఈవో రాజునాయక్, ఎంపీపీ నారాయణ, యంగిస్తాన్ ఫౌండేషన్ సభ్యురాలు జాగృతి, ఎన్‌జీవో ప్రతినిధి చిన్మయి థామస్, సర్పంచ్ రాంలాల్, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

