తెలంగాణ రాష్ట్రంలో మరోసారి సెంటిమెంట్ రాజుకొనే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలు మాటల యుద్ధానికి దారితీశాయి. దీనికితోడు తాజాగా బాలసుబ్రహ్మణ్యం విగ్రహ(SP Balu Statue) రాజకీయం మొదలైంది. ఈ అంశాలు ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్నది పక్కనపెడితే నిత్యం వివాదాలతో రాష్ట్రం రగిలిపోతున్నది. సోషల్ మీడియాలో నెటిజన్లు శిబిరాల కింద విడిపోయి పోస్టులు పెడుతూ మంటలు పుట్టిస్తున్నారు.
రవీంద్రభారతిలో భారతిలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 15న రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విగ్రహ ఏర్పాట్లపై వివాదం రాజుకున్నది. తెలంగాణకు చెందిన పలువురు కవులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు.
ఆంధ్రాప్రాంతానికి చెందిన బాలు విగ్రహం(SP Balu Statue) తెలంగాణలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటూ ఇప్పటికే పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. తాజాగా తెలంగాణ క్రాంత్ దళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ విగ్రహ ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రవీంద్రభారతికి వెళ్లి.. బాలసుబ్రహ్మణ్యం బంధువు శుభలేక సుధాకర్ తో వాగ్వాదానికి దిగారు. తెలంగాణ ప్రాంతంలో ఎందరో గొప్ప కవులు, కళాకారులు ఉన్నారని.. వాళ్ల విగ్రహాలు ఏర్పాటు చేయాలంటూ ఆయన సూచించారు. అందెశ్రీ, గద్దర్ వంటి ప్రజా కవులు విగ్రహాలు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా తెలంగాణ ప్రాంతానికి చెందిన కవుల విగ్రహాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.
బాలసుబ్రహ్మణ్యం అభిమానులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. బాలు కొన్ని వేల సంఖ్యలో తెలుగు పాటలు పాడారని.. ఆయనకు ప్రాంతం అంటగట్టడం సరికాదని అంటున్నారు. పక్కరాష్ట్రమైన తమిళనాడులోనే ఆయనకు ఎంతో గౌరవం ఉందని.. అటువంటిది తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఆయన విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం సరికాదని చెబుతున్నారు. బాలూ విగ్రహాన్ని రవీంద్రభారతిలో ఘంటసాల విగ్రహం పక్కన ఏర్పాటు చేస్తున్నారు.
ఉద్యమసమయంలో ట్యాంక్ బండ్ మీద ఆంధ్రాప్రాంతానికి చెందిన కవుల విగ్రహాలు ఉండటాన్ని చాలా మంది తప్పుపట్టారు. అప్పట్లో ఆ విగ్రహాల మీద దాడులు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు మరోసారి అటువంటి విగ్రహరాజకీయమే మొదలైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే ఘాటుఘాటుగా కామెంట్లు నడుస్తున్నాయి. రాజకీయపార్టీలు ఈ విషయంలో మౌనంగా ఉంటున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటివరకు స్పందించలేదు. బాలుకు తెలంగాణ రాష్ట్రంలోనూ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆయనను ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఎవరూ చూడలేదు. మరి ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాలి.
Read Also: అఖండ 2 టికెట్ రేట్ల పెంపు.. ఎంతంటే?
Follow Us on: Facebook


