పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) క్షేమమే. ఈ మేరకు ఆయన సోదరి మంగళవారం ప్రకటించారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ చనిపోయారంటూ కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు, వదంతులకు తెరపడింది. కాగా, ఓ కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను రెండేళ్ల కిందట అరెస్టు చేసిన పాక్ ప్రభుత్వం ఆయన్ని రావల్పిండిలోని అడియాలా జైలులో ఉంచింది. అక్కడ శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ చనిపోయినట్లు, ఆయన్ను హత్య చేసినట్లు నెల నుంచి వార్తలు వస్తున్నాయి.
దీంతో ఇమ్రాన్(Imran Khan) కుటుంబ సభ్యులు, అభిమానులు, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. ఇమ్రాన్ కు ఏమైందో చెప్పాలని, ఆయన్ని చూపించాలని నిరసనలకు దిగారు. మరోవైపు ఇమ్రాన్‌ను కలవడానికి ఆయన కుటుంబసభ్యులకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇమ్రాన్ ఖాన్ సోదరి ఉజ్మా ఖానుమ్‌తో పాటు ఒక న్యాయవాదిని మంగళవారం జైలులోకి అనుమతించింది. అక్కడ సోదరుడిని కలసిన అనంతరం ఆయన క్షేమంగానే ఉన్నట్లు ఉజ్మా మీడియాకు వెల్లడించింది. అయితే, జైలు అధికారులు ఆయన్ని మానసికంగా హింసిస్తున్నట్లు ఆరోపించింది.
Read Also: రవీంద్రభారతిలో ఎస్పీ బాలూ విగ్రహంపై వివాదం
Follow Us on: Facebook


