కలం, ఖమ్మం బ్యూరో : రమణీయం రాములోరి కళ్యాణం.. వేద భూమి భద్రాచలం (Bhadrachalam) పుణ్యక్షేత్రంలో మిథిలా ప్రాంగణంలో శుక్రవారం జరిగిన శ్రీ సీతారాముల వారి తిరు కళ్యాణ మహోత్సవ వేడుక ఆధ్యాంతం భక్తులను కనువిందు చేసింది. తరతరాలుగా ప్రతి ఏటా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న విషయం విధితమే. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవంలో భాగంగా తొలుత ఉదయం రామాలయంలోని గర్భగుడిలో ధ్రువమూర్తులకు అర్చక స్వాములు కళ్యాణం జరిపారు. తదుపరి భాజా భజంత్రీల సవ్వడి, సన్నాయి మేళాల సందడి, భక్తుల జయ జయ ద్వానాల నడుమ శ్రీ సీతారామచంద్రస్వామి వారిని పల్లకిపై ఊరేగింపుగా మిధుల మండపం వద్దకు తీసుకువచ్చారు. సీతమ్మవారిని, రాములవారిని ఎదురెదురుగా కూర్చోబెట్టి అర్చక స్వాములు కళ్యాణ తంతును ప్రారంభించారు. తిరు కళ్యాణము కు సంకల్పం చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం గావించారు. దర్భ తాడును సీతమ్మ వారి నడుముకు బిగించారు. రాములోరి కుడి చేతికి, సీతమ్మ వారి ఎడమ చేతికి రక్ష సూత్రాలు తొడిగారు. సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరింప చేశారు. ప్రవరణ, మోక్ష బంధన, యజ్ఞోపవేతం, వరపూజ, మధుపర్కం సూత్రం తదితర కార్యక్రమాలను అర్చక స్వాములు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
శ్రీ భక్త రామదాసు చేపించిన పచ్చల పతకం రాములోరికి, చింతాకు పతకం సీతమ్మవారికి, శ్రీరామ మాడ లక్ష్మణ స్వామి వారికి అలంకరింప చేశారు. కచ్చితంగా 12 గంటలకు పుణ్య ముహూర్తం అభిజిత్ లగ్నం సమీపించగానే వధూవరుల శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచారు. జనక మహారాజు, దశరథ మహారాజు తరపున చేయించిన రెండు మంగళసూత్రాలతో పాటు, భక్త రామదాసు సీతమ్మవారికి చేయించిన మరొక సూత్రం కలిపి మూడు సూత్రాలతో మాంగల్య ధారణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు సాంప్రదాయ బద్దంగా జరిపారు. తదుపరి వైష్ణవ సాంప్రదాయం ప్రకారం బంతులాట, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు జరిపారు. అష్టోత్తర హారతితో కళ్యాణ తంతును అర్చక స్వాములు ముగించారు. కళ్యాణం ఆధ్యాంతం అర్చక స్వాములు వేదమంత్రాలు గావించారు. కళ్యాణ విశిష్టతను ఈ సందర్భంగా వివరించారు. భక్తులు కళ్యాణాన్ని తిలకిస్తూ తన్మయానికి లోనయ్యారు. శ్రీరామ జయరామ అంటూ జయ జయ ధ్వనాలు చేశారు.
ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి..
భద్రాచలం (Bhadrachalam)లో సాంప్రదాయబద్ధంగా ప్రతి ఏట జరిగే శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించడం తర తరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సతీ సమేతంగా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం వద్ద రూ. 351 కోట్లతో చేపట్టిన ఆలయ అభివృద్ధి తొలిదశ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం మిథిలా స్టేడియంలో నిర్వహించిన శ్రీ సీతా రామచంద్ర స్వామి తిరుకళ్యాణ మహోత్సవంలో వేలాది భక్తుల నడుమ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి దంపతులు స్వామి, అమ్మ వార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ, ఎంపీ పోరిక బలరాం నాయక్, న్యాయమూర్తులు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా అయ్యర్, ఎండోమెంట్ కమీషనర్ హన్మంత రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్, పీఓ బి. రాహుల్, అదనపు కలెక్టర్లు విద్యా చందన, వేణుగోపాల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
భద్రాద్రికి పోటెత్తిన భక్తులు..
భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ వేడుకకు దేశ నలుమూల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున భద్రాచలం తరలివచ్చారు. భక్తుల రాక కనుగుణంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. జిల్లా కలెక్టర్ అంకిత్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు భక్తులకు వివిధ సౌకర్యాలు కల్పించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి దామోదర్ రావు ఆధ్వర్యంలో ఉద్యోగులు, అర్చక స్వాములు వేద పండితుల సహకారంతో వైదిక క్రతువును విజయవంతంగా జరిపారు.
శ్రీరామ పట్టాభిషేకానికి ఏర్పాట్లు..
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం మిథిలా ప్రాంగణంలో శ్రీరామ పట్టాభిషేకం వేడుక జరగనుంది. ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ క్రమంలో అధికారులు హై అలర్ట్ అయ్యారు. శ్రీరామ పట్టాభిషేకం వేడుకకు కూడా భక్తులు వేలాది సంఖ్యలో హాజరుకానున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నిర్వాహకులు ఈ వేడుకకు సంబంధించి వైదిక పరమైన ఏర్పాట్లను చేస్తున్నారు.

