కలం, వెబ్ డెస్క్: అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లయిన వ్యక్తి మేజర్ అయిన మహిళతో సహజీవనం చేయడం చట్ట ప్రకారం నేరం కాదని వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక జంట తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది.
వివరాల్లోకి వెళ్తే.. అనామిక, నేత్రపాల్ అనే ఇద్దరు మేజర్లు సహజీవనం చేస్తున్నారు. అయితే నేత్రపాల్‌కు ఇదివరకే వివాహం జరిగింది. వీరిద్దరి సంబంధాన్ని అనామిక కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తూ.. వారిని చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలని సదరు జంట పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో హైకోర్టులో (Allahabad High Court) పిటిషన్ వేశారు. దీంతో ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో కలిసి ఉండటం ఏ రకమైన నేరం కిందకు రాదని విచారణ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది.
సామాజిక అభిప్రాయాలు, నైతిక విలువల ఆధారంగా కోర్టులు పౌరుల హక్కులను కాలరాయలేవని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. చట్టం ప్రకారం.. ఓ వివాహితుడు వేరే మహిళతో కలిసి ఉండటాన్ని ప్రశ్నించే హక్కు కేవలం అతడి భార్యకు మాత్రమే ఉంటుందని వ్యాఖ్యానించింది. ఇతర కుటుంబ సభ్యులకు, బయటి వ్యక్తులకు ఆ హక్కు లేదని కోర్టు స్పష్టం చేసింది.కలిసి ఉండాలనుకునే ఇద్దరు వయోజనులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది.
Read Also: పోషకాహారం తింటున్నా లోపం తగ్గట్లేదా? అసలు కారణం ఇదే!
Follow Us On: Facebook

