కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : పాలమూరు ప్రాజెక్టుల సందర్శనకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Revanth Reddy).. ప్రజలు ఎక్కడికక్కడే అడ్డుకుంటారన్న భయంతోనే ఆయన ఆకాశమార్గం (హెలికాప్టర్) ద్వారా ప్రాజెక్టులను సందర్శిస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఆరోపించారు. సీఎం జిల్లాకు వస్తున్న సందర్భంగా గురువారం మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని గృహనిర్బంధం చేయడం దుర్మార్గమని విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి, “ జిల్లాకు ఏం వెలగబెట్టారని ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారు?” అని ప్రశ్నించారు.
గత రెండున్నరేళ్లలో ఏ ఒక్క పెండింగ్ ప్రాజెక్టును కూడా ప్రారంభించలేదని ఆరోపించారు. అరెస్టు చేసిన తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం పర్యటన పేరుతో ప్రతిపక్ష నేతలను అక్రమంగా నిర్బంధించడం సరికాదని అన్నారు. “విపత్తుల సమయంలో పర్యటన చేయని వారు ఇప్పుడు ఎందుకు హెలికాప్టర్‌లో పర్యటిస్తున్నారు?” అని ఆయన ప్రశ్నించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితి ఉందని, కల్లాల్లో వడ్లు ఇంకా నిల్వలుగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు భరోసా (Rythu Bharosa) వంటి అంశాలను అడుగుతారనే భయంతోనే హెలికాప్టర్ పర్యటనలు చేస్తున్నారని నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను కోల్పోయిందని, ఇకపై ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో లేరని ఆయన అన్నారు. ‘ఏదో చేస్తారు అనే భ్రమలో ప్రజలు ఇంతకాలం ఓపిక పట్టారు. కానీ ఇప్పుడు ప్రజల్లో విశ్వాసం పూర్తిగా పోయింది’ అని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వానికి పరాభవం తప్పదని ఆయన జోస్యం చెప్పారు.
Read Also: అమీర్ ఖాన్ మూడో పెళ్లి.. ఆమె ఎవరంటే?
Follow Us On: Instagram

