Mobile Popup Ad
Mobile Popup Ad

ఓటమిని జీర్ణించుకోలేకే నాపై బిగాల ఆరోపణలు: ఎమ్మెల్యే ధన్ పాల్

కలం, వెబ్ డెస్క్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ నియోజకవర్గ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ అసహనంతో ఉన్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) ఆరోపించారు. ఓటమిని జీర్ణించుకోలేకే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అవినీతి, అభివృద్ధిపై ప్రశ్నించే దమ్ము లేక బిగాల గణేష్ ఇలాంటి చర్యలకు దిగుతున్నాడని నిజామాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ 60 స్థానాల్లో ఒకటే సీటును గెలుపొంది, కనీసం ఆ ఒక్క సీటును కూడా కాపాడుకోలేని అసమర్థ నాయకుడు బిగాల గణేష్ అని ఆరోపించారు. తాను గెలిచిన తర్వాత గతంలో ఉన్న పెండింగ్ పనులపై అధికారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లి వాటిని అభివృద్ధి పరచడానికి కృషి చేస్తున్నానన్నారు. ఇది జీర్ణించుకోలేని బిగాల అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. బిగాల పదేళ్లు అధికారంలో ఉన్నా .. అర్బన్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇప్పించలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ప్రశాంత్ రెడ్డి ఉన్నాడని, ఆయనకు రాజీనామా చేయమని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. అలాగే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ హబ్ లో ఒక్క ప్రముఖ కంపెనీ కూడా తీసుకురాలేదని, మరి కేటీఆర్ ని రాజీనామా చేయమని నిలదీశావా? అని ప్రశ్నించారు. కేవలం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికే పని చేశావే తప్ప..నిజామాబాద్ అభివృద్ధికి కాదని బిగాల గణేష్ పై మండిపడ్డారు.

బిగాల గణేష్.. కమీషన్, కరప్షన్, కలెక్షన్ కు అలవాటు పడి పదేళ్లు పాలించాడని విమర్శలు గుప్పించారు. ఇటీవల తాను మంత్రులపై ఒత్తిడి తేవడంతో నగరంలో 396 ఇల్లు కేటాయించారన్నారు. అలాగే మరో వారంలో నగర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నట్లు తెలిపారు. ఇటీవల నగరంలోని మినీ ట్యాంకుబండ్ పై బిగాల గణేష్ గుప్తా అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నాడని చెప్పారు. ట్యాంక్ బండ్ కాంట్రాక్టర్ సమయం ముగియడంతో తాళాలు వేసి వెళ్లారన్నారు. కొత్త కాంట్రాక్టర్ నియమంచాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, కార్పొరేషన్ పై ఉందన్నారు. అదే మినీ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన చెట్లలో అవినీతికి పాల్పడ్డ చరిత్ర బిగాలది అన్నారు. నాలుగున్నర వేల ఒక్కో చెట్టును 45 వేలుగా చూయించి దోచుకున్నారన్నారు. అలాగే కార్పొరేషన్ లో ఒక్క మనిషి విధులు నిర్వహించుకున్నా.. 330 మంది పనిచేస్తున్నట్లు రికార్డుల్లో చూయించి నెలకు 50 లక్షలు దోచుకున్నారన్నారు.

బహిరంగ చర్చకు సిద్ధం

ఏ శాఖలో అయినా తాను ఒక్క రూపాయి అవినీతి చేసినట్లు నిరూపిస్తే బహిరంగ చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గల గణపతి ఆలయం ముందుకు తాను వస్తానని చెప్పారు. తన హయాంలో ఒక్క గుంట భూమి కొనుగోలు చేయలేదని, బిగాల మాత్రం ఒక్క గుంట కూడా విడిచిపెట్టలేదన్నారు. అలాగే ఆర్యవైశ్యులు అంటే దానధర్మాలకు ప్రతిక అని, కానీ బిగాల మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాడన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి బిజెపి ఫ్లోర్ లీడర్ ప్రమోద్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతి, కార్పొరేటర్లు చింతకాయల రాజేందర్, మఠం పవన్, బంటు ప్రీతి ప్రవీణ్, బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, కల్పే అర్చనా చిరంజీవి, మమత శివ, సీనియర్ నాయకులు న్యాలం రాజు, పుట్ట వీరేందర్, బీజేవైఎం రాష్ట్ర కో కార్యదర్శి విజయ్, ఇల్లెందుల ప్రభాకర్, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>