Mobile Popup Ad
Mobile Popup Ad

సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం.. మణుగూరు ఓసీ-4 కార్మికులకు నరకం

​కలం, ఖమ్మం బ్యూరో: దేశానికి వెలుగులు పంచే బొగ్గు గని కార్మికుల జీవితాలు ప్రస్తుతం చీకట్లోకి, దుమ్ము ధూళిలోకి నెట్టబడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి (Singareni) ఏరియాలోని ఓపెన్ కాస్ట్ – 4 (OC-4) లో అధికారుల తీవ్ర నిర్లక్ష్యం కారణంగా కార్మికులు నరకయాతన అనుభవిస్తున్నారు. పర్యావరణ నిబంధనల ప్రకారం మైనింగ్ ప్రాంతాల్లో నిరంతరం జరగాల్సిన వాటర్ స్ప్రేయింగ్ ప్రక్రియను వారం రోజులుగా పూర్తిగా నిలిపివేయడంతో కార్మికుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది.

మండుతున్న సింగరేణి ప్రాంతం

​ప్రస్తుతం వేసవి కాలం కావడంతో భానుడి భగభగలకు మణుగూరు పరిసర ప్రాంతాలు మండిపోతున్నాయి. ఒకవైపు 46 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు ఓపెన్ కాస్ట్ గనిలో భారీ యంత్రాల కదలికల వల్ల లేస్తున్న దుమ్ము మేఘాలు కార్మికులను ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి.

కార్మికుల నరక యాతన

ఓసీలో బొగ్గు రవాణా చేసే భారీ టిప్పర్లు, లారీలు వెళ్తుంటే కళ్లు కూడా కనబడనంతగా దుమ్ము లేస్తోందని, కనీసం ఎదురుగా వచ్చే వాహనం కూడా కనిపించని స్థితిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ​మైనింగ్ నిబంధనల ప్రకారం ఓబీ (ఓవర్ బర్డెన్), బొగ్గు రవాణా జరిగే అంతర్గత రహదారులపై రోజుకు పలుమార్లు నీటి లారీల ద్వారా తడిపాల్సి ఉంటుంది. గత వారం రోజులుగా ఒక్కటంటే ఒక్క నీటి ట్యాంకర్ కూడా ఓసీ-4 లోకి రాకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

పట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఏరియా అధికారులు

నీళ్లు చల్లడం లేదని కార్మికులు నెత్తీనోరూ మొత్తుకుంటున్నా, ఏరియా ఉన్నతాధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కంటిన్యూగా ఈ బొగ్గు దుమ్మును పీల్చడం వల్ల కార్మికులు ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, కంటి ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. మాస్కులు పెట్టుకున్నా సరే, ఆ సన్నటి బొగ్గు, మట్టి రేణువులు శ్వాస ద్వారా శరీరంలోకి చేరుతున్నాయని వారు వాపోతున్నారు.

సంస్థ లాభాల్లో.. కార్మికులు ఇబ్బందుల్లో

లాభాల బాటలో పయనిస్తున్న సింగరేణి సంస్థకు, ఆ లాభాల వెనుక ఉన్న కార్మికుల ప్రాణాలు, ఆరోగ్యం పట్టకపోవడం విచారకరమని కార్మిక కుటుంబాలు, స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా మణుగూరు సింగరేణి ఉన్నతాధికారులు స్పందించి, ఓసీ-4 లో వాటర్ స్ప్రేయింగ్ పనులను పునరుద్ధరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పర్యావరణ అధికారులపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఈ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కార్మికులు హెచ్చరిస్తున్నారు.

డ్యూటీకి రావాలంటేనే భయమేస్తోంది

మణుగూరు ఓసీ- 4 లో, డస్ట్ విపరీతంగా వస్తుంది. ఇవ్వాళ డ్యూటీ‌కి వచ్చిన కార్మికుడు రేపు డ్యూటీకి రావాలంటే ఆలోచిస్తున్న పరిస్థితి. ఏరియా జీఎం తో పాటు ఉన్నతాధికారులు దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్ళాను. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. గ్రౌండ్ మానిటరింగ్ చేసే కార్మికులందరూ డస్ట్ సమస్యను ఎదుర్కొంటున్నారు.యాజమాన్యం ఎంత సేపటికీ ఉత్పత్తి మీదనే దృష్టి కేంద్రీకరించి, కార్మికుల ప్రాణాలు గాలికొదిలేసింది.

రామ్ గోపాల్, బ్రాంచ్ సెక్రటరీ ఏఐటీయూసీ

యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి

ఎండలు ఎక్కువగా ఉండటంతో ఓసీ 4 గనిలో, నీటి నిల్వలు లేవు. అందుకే స్ప్రే చేయడం లేదని యాజమాన్యాలు చెప్తున్నాయి. కానీ సమీపంలోనే చెరువు ఉంది. సింగరేణి అధికారులకు కార్మికుల పట్ల చిత్త శుద్ధి ఉంటే చెరువు నుంచి నీళ్లు తెచ్చి స్ప్రే చేయవచ్చు. కానీ కేవలం నిర్లక్ష్య ధోరణి కారణంగానే స్ప్రే చేయడం లేదు.
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>