కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ (Nalgonda) జిల్లాలో వడ్ల రవాణా టెండర్ల వ్యవహారంలో సిండికేట్ కాంట్రాక్టర్లు ఆడిన మాయాజాలం అంతా ఇంతా కాదు. తమ వద్ద కనీసం పది లారీలు లేకపోయినా.. బోగస్ ఆర్సీలు, ఒకే నంబర్‌ను పదే పదే చూపిస్తూ కాగితాలపై ఏకంగా 820 లారీలు ఉన్నట్టు భ్రమ కల్పించి టెండర్లు కొట్టేశారు. తీరా సీజన్ ముంచుకొచ్చినా.. ఫీల్డ్‌లో లారీలు కనిపించకపోవడంతో అధికారులు కంగు తినగా, లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకుపోయి రైతన్న గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.. రైతు రెక్కల ముక్కలు చేసుకుని పండించిన ధాన్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థ, కాంట్రాక్టర్ల కక్కుర్తికి.. అధికారుల నిర్లక్ష్యానికి బలైపోయింది. నల్లగొండ జిల్లాలో వడ్ల రవాణా టెండర్ల వ్యవహారంలో వందల కోట్ల కుంభకోణానికి తెరలేచింది. కాగితాల మీద వందల లారీలను పరిగెత్తించిన కాంట్రాక్టర్లు.. తీరా గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి చేతులెత్తేశారు. ఫలితంగా కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలు పేరుకుపోయి రైతన్న ఆకాశం వైపు దీనంగా చూసే పరిస్థితి దాపురించింది.
టెండర్లలో అసలు ఏం జరిగిందంటే..?
గత ఏప్రిల్ నెలలో జిల్లా టెండర్ల కమిటీ నల్లగొండ, చిట్యాల, నకిరేకల్, మిర్యాలగూడ సహా 10 క్లస్టర్ల పరిధిలోని 459 కొనుగోలు కేంద్రాల నుంచి వడ్లను మిల్లులకు తరలించేందుకు స్టేజ్-1 కాంట్రాక్టర్లను ఎంపిక చేసింది. ఈ జాబితాకు స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ గుడ్డిగా ఆమోద ముద్ర వేసింది. కానీ, ఇక్కడే అసలు ఆట మొదలైంది. టెండర్లు దక్కించుకున్న 10 మంది కాంట్రాక్టర్లు ఒకే సిండికేట్‌గా మారారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు కావడం గమనార్హం. కాంట్రాక్టర్లు తమ వద్ద లేని లారీలను ఉన్నట్టు చూపించడానికి ఒకే లారీ నంబర్‌ను పలుమార్లు వాడారు. ఇతర ప్రాంతాల వాహనాల ఫోటోలు, ఆర్సీలను జతచేసి తమకు భారీ సామర్థ్యం ఉన్నట్టు రికార్డుల్లో సృష్టించారు. కాగితాలపై 820 లారీలు ఉన్నట్టు చూపించి టెండర్లు దక్కించుకున్నారు కానీ, నిజానికి ఏ ఒక్క కాంట్రాక్టర్ వద్ద కనీసం 10 లారీలు కూడా లేవనేది పచ్చి నిజం. నిజంగానే కాగితాలపై చూపిన 820 లారీలు ఫీల్డ్‌లో ఉంటే.. రోజుకు కనీసం 30 వేల మెట్రిక్ టన్నుల వడ్లు మిల్లులకు చేరాలి. కానీ క్లస్టర్ల వారీగా పరిస్థితి చూస్తే షాక్‌కు గురికావాల్సిందే. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సెంటర్లకు 7,01,249 మెట్రిక్ టన్నుల వడ్లు రాగా.. 6,23,791 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. లారీల కొరత వల్ల 6,09,983 టన్నులు మాత్రమే ట్రాన్స్‌పోర్ట్ చేశారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది.
కమీషన్ల కక్కుర్తి..
ప్రభుత్వం నేరుగా రవాణా కమీషన్లను ట్రాన్స్‌పోర్ట్ సంస్థల ఖాతాల్లో వేస్తుంది. ఈ సొమ్మును కొట్టేయడానికి కాంట్రాక్టర్లు దిగజారుడు రాజకీయాలకు తెరలేపారు. టెండర్లు వచ్చాక లారీలు లేకపోవడంతో.. కొందరు కాంట్రాక్టర్లు తమ వాట్సాప్ స్టేటస్‌లలో “లారీలు కావాలి” అంటూ పబ్లిసిటీ చేసుకునే దౌర్భాగ్య స్థితికి వచ్చారు. ఇసుక, సిమెంట్ లారీల ఓనర్లతో తాత్కాలికంగా చేతులు కలిపి నడుపుతున్నారే తప్ప, సొంత వాహనాలు లేవు. అధికారులు అడిగితే.. “మిల్లుల వద్ద అన్లోడ్ ఆలస్యం కావడం వల్లే లారీలు రాలేదు” అని అబద్ధాలు చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు. చివరికి అధికారులు లారీ డ్రైవర్లకు స్వయంగా ఫోన్లు చేసి బతిమిలాడుకునేలా కాంట్రాక్టర్లు పరిస్థితిని దిగజార్చారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే తాత్కాలిక ప్యాచ్ వర్క్‌లు సరిపోవు. వ్యవస్థలో మూలాల నుంచి మార్పు రావాలి. ఎల్ 1 కాంట్రాక్టర్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే.. స్థానిక లారీ అసోసియేషన్లతో ప్రభుత్వం నేరుగా మాట్లాడాలి. మధ్యవర్తులు లేకుండా వాళ్లకే రవాణా బాధ్యతలు, కమీషన్లు ఇస్తే లారీల కొరత అనే మాటే రాదు.
కలెక్టర్లు రోడ్లపైకి రావాల్సిన దుస్థితి
గత ఏడాది లాగే ఈసారి కూడా లారీల కొరత వల్ల కలెక్టర్లు, ఎస్పీలు రోడ్లపైకి వచ్చి వెళ్లే ప్రైవేట్ వాహనాలను, ట్రాక్టర్లను ఆపి వడ్ల సెంటర్లకు మళ్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకున్నా.. క్షేత్రస్థాయిలో కాంట్రాక్టర్ల రాజకీయ పలుకుబడి ముందు అధికారులు మోకరిల్లుతున్నారు. 60 శాతం కొనుగోళ్లు పూర్తయినా ఇంకా లారీల కొరత తీరకపోవడం జిల్లా టెండర్ల కమిటీ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి బోగస్ కాగితాలను నమ్మిన అధికారులపై, ప్రభుత్వాన్ని మోసం చేసిన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. టెండర్ల ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేసి, లారీ అసోసియేషన్లను రంగంలోకి దింపితేనే నల్లగొండ జిల్లా రైతాంగానికి న్యాయం జరుగుతుంది.

