కలం, వెబ్ డెస్క్ : తెలంగాణను డిజిటల్ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ముందడుగు వేసింది. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి బలమైన హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియాతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు అమెండేడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ABP) కింద తెలంగాణలో టీ-ఫైబర్ ప్రాజెక్టు ( T Fiber Project) అమలుపై కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియాతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా… సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి. అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ డి. అనుదీప్, ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమెండేడ్ భారత్‌నెట్ ప్రోగ్రాం సజావుగా అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలక అంశాలను సింధియా దృష్టికి తీసుకువెళ్ళారు. అమలుకు సంబంధించిన ఒప్పందాన్ని త్వరితగతిన కుదుర్చుకోవడం, పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదలను వేగవంతం చేయడంపై చర్చించారు. మండలం నుండి గ్రామ పంచాయతీ రింగ్ నెట్‌వర్క్ ఆస్తులను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేయడంపై స్పష్టమైన విధానం ఏర్పాటు చేయడం పై కూడా కేంద్ర మంత్రి సింధియాతో ప్రస్తావించారు. వీటిపై సింధియా సానుకూలంగా స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మిస్తున్న ఏకీకృత డిజిటల్ నెట్‌వర్క్‌లో ‘రింగ్ ఆర్కిటెక్చర్’’ డిజిటల్ రంగంలో కీలకంగా మారనుంది. ‘రింగ్ ఆర్కిటెక్చర్’ ద్వారా ఒక మార్గంలో అంతరాయం ఏర్పడినా, ప్రత్యామ్నాయ మార్గం ద్వారా సేవలు నిరంతరం కొనసాగుతాయి. తద్వారా గ్రామీణ తెలంగాణకు నిజమైన నిరంతర హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ అందనుంది. మొదటి దశలో దెబ్బతిన్న నెట్‌వర్క్ ఉన్న ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 3,089 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ పునరుద్ధరణ చేపట్టనున్నారు. అమెండేడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ కింద ఈ గ్రామాలను ఆధునిక, భవిష్యత్తు అవసరాలకు సరిపడే ఫైబర్ మౌలిక సదుపాయాలతో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో సమానంగా అనుసంధానిస్తారు. తెలంగాణ కోసం భవిష్యత్తును తీర్చిదిద్దే బలమైన నెట్‌వర్క్ కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం, కేంద్రం తో ఒప్పందం కుదుర్చుకోవడంతో, నిజమైన డిజిటల్ తెలంగాణకు పునాది పడనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తాజా హామీ తెలంగాణను డిజిటల్ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు దోహదపడనుంది.

