సింగరేణి ‘భవిష్యత్తు’కు భద్రాద్రి గని.. 9 కొత్త ప్రాజెక్టుల్లో జిల్లాదే సింహభాగం!

కలం, ఖమ్మం బ్యూరో: సింగరేణి సంస్థకు గుండెకాయ వంటి భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri) జిల్లా, రానున్న రోజుల్లో రాష్ట్రానికే ఇంధన భాండాగారంగా మారబోతోందనీ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 9 కొత్త ప్రాజెక్టుల్లో అత్యధికం ఈ జిల్లాలోనే ఉండటం విశేషం. పాత గనులు మూతపడుతున్నా, జిల్లాలో కొత్త గనుల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు కూడా మెండుగానే ఉండబోతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ​ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో భద్రాద్రి గడ్డపై బొగ్గు రికార్డు స్థాయి ఉత్పత్తికి సర్వం సిద్ధమైంది.

అగ్రస్థానంలో భద్రాద్రి (Bhadradri)

​ప్రభుత్వం ప్రకటించిన కొత్త ప్రాజెక్టుల జాబితాను పరిశీలిస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఏరియాలే సింహభాగాన్ని దక్కించుకున్నాయి. కొత్తగూడెం ఏరియాలోని ​వీకే కోల్ మైన్ 190 మిలియన్ టన్నుల భారీ నిల్వలతో రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌గా మారింది. ఇప్పటికే ఓవర్ బర్డెన్ పనులు ప్రారంభం కావడంతో జిల్లాలో సందడి మొదలైంది. అలాగే ​పీకే కోల్ మైన్ కొండాపూర్ పరిధిలో 62 మిలియన్ టన్నుల నిల్వలతో మణుగూరు ప్రాంతానికి కొత్త కళ రానున్నది. ​మణుగూరు ఓసీ ఎక్స్ టెన్షన్ 40.45 మిలియన్ టన్నులతో మణుగూరు ఏరియా మరింత విస్తరించనుంది. వీటితో పాటు ​సింగరేణి పురిటిగడ్డ ఇల్లందులో జేకే ఓపెన్ కాస్ట్ ద్వారా 19.68 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కార్మికులకు కొండంత అండ

గనులు మూతపడతాయనే ఆందోళన చెందుతున్న వేలాది మంది కార్మికులకు ఈ కొత్త ప్రాజెక్టులు కొండంత అండగా నిలవనున్నాయి. కొత్త గనుల ఏర్పాటుతో అనుబంధ పరిశ్రమలు, రవాణా రంగం పుంజుకొని జిల్లా ఆర్థికంగా బలోపేతం కానుంది. కేవలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండే సుమారు 312 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు నిల్వలను వెలికితీసే అవకాశం ఉండటంతో మరో రెండు దశాబ్దాల పాటు భద్రాద్రి జిల్లా సింగరేణికి ప్రధాన కేంద్రంగా ఉండనుంది.

డిప్యూటీ సీఎం స్పెషల్ ఫోకస్

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లాలోని ప్రాజెక్టులపై ప్రత్యేక నిఘా పెట్టారు. మణుగూరు పీకే కోల్ మైన్, కొత్తగూడెం వీకే మైన్‌లకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావడంలో ఆయన కీలకపాత్ర పోషించడం పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ఏడాది తిరగకముందే పట్టాలెక్కించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ​బొగ్గు గనులంటే కేవలం నల్ల బంగారమే కాదు.. వేలాది కుటుంబాల జీవనాధారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను సింగరేణికి చిరునామాగా మార్చుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జిల్లా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.

కొత్త గనుల ప్రారంభానికి శ్రీకారం

రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కాలరీస్ సంస్థను కేవలం ఒక బొగ్గు గనిగా కాకుండా, రాష్ట్ర ఆర్ధిక ఇంజన్‌గా భావిస్తున్నది. అందులో భాగంగానే మరో 20 ఏళ్ల ఇంధన భద్రతే లక్ష్యంగా 9 కొత్త గనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 3 కొత్త గనుల ప్రారంభం కానున్నాయి.

–  డాక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి, సింగరేణి సీఎండీ

Read Also: నీట్ పరీక్ష రద్దు కావడం అత్యంత దురదృష్టకరం: మంత్రి రాజనర్సింహ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>