Mobile Popup Ad
Mobile Popup Ad

వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి జాగ్రత్తలు తీసుకోవాలి.. సీఎండీ ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని తెలంగాణలోని అన్ని సింగరేణి ఏరియాల జీఎంలను సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి (Singareni CMD Buddhaprakash Jyothi) ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తిపై ముందస్తు జాగ్రత్త చర్యలను సత్వరమే తీసుకోవాలన్నారు. మరో 10 రోజుల్లో నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నందున వర్షాకాలంలోనూ సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించడం కోసం సింగరేణి యాజమాన్యం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని చెప్పారు. వానాకాలంలో సైతం థర్మల్ విద్యుత్  కేంద్రాలకు నిరాటంకంగా బొగ్గును సరఫరా చేయాలన్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆదేశం మేరకు శనివారం అన్ని ఏరియాలలోని జనరల్ మేనేజర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు.

 ఓపెన్ కాస్ట్ గనుల నుంచే  95% బొగ్గు..

సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో 95% బొగ్గు ఓపెన్ కాస్ట్ గనుల నుంచి వస్తోందని సీఎండీ వివరించారు. భారీ వర్షాలకు ఓపెన్ కాస్ట్ గనుల్లో నీరు నిలువ ఉండి ఉత్పత్తికి ఆటంకం కలుగుతూ ఉంటుందని చెప్పారు. అయితే నీటిని బయటకు తోడి ఉత్పత్తిని కొనసాగించేందుకు సింగరేణి సంస్థ ఇప్పటికే అన్ని ఓపెన్ కాస్ట్ గనుల్లో 100 కు పైగా భారీ పంపులను, మోటార్లను ఏర్పాటు చేసిందని చెప్పారు.

నీటి పరిమాణం మరింత పెరిగే అవకాశం..

భారీ వర్షాల వల్ల నీటి పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉందని సీఎండీ అంచనా వేశారు. ఈ నేపథ్యంలో కంపెనీ పంపులతో పాటు కొన్ని ప్రైవేటు పంపులను కూడా ఏర్పాటు చేసి ఓవర్ బర్డెన్, బొగ్గు బెంచీల వద్ద నీరు నిలువ లేకుండా చూడాలని సూచించారు. హాల్ రోడ్లను పటిష్టపరచుకోవాలని.. తగినన్ని పంపులను  సమకూర్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. దీనికోసం కార్పోరేట్ కార్యాలయంలోని సంబంధిత జీఎంలు టెండర్లకు సంబంధించిన చర్యలు తీసుకోవాలన్నారు.

థర్మల్ విద్యుత్ కేంద్రాలకు యథావిధిగా బోగ్గు..

సింగరేణితో ఇంధన సరఫరా ఒప్పందం ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును యథావిధిగా కొనసాగించడానికి అన్ని ఏరియాలలోని యాజమాన్యాలు తగు చర్యలు తీసుకోవాలని సీఎండీ సూచించారు.  ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రతీ ఏరియా సాధించిన బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా, ఓవర్ బర్డెన్  తొలగింపుపైనా సమీక్షించారు. కొన్ని ప్రధాన ఓపెన్ కాస్టు గనులు ఉత్పత్తి లక్ష్యాలు సాధించలేకపోవడానికి గల కారణాలపై ఆయన లోతుగా చర్చించారు.  ముఖ్యంగా భారీ యంత్రాలతో పూర్తి పనిగంటలు సద్వినియోగం చేయాలని, మానవ వనరులను కూడా పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆయన ఆదేశించారు. కంపెనీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను కార్మికులకు వివరిస్తూ.. ప్రతీ ఉద్యోగి సంస్థ అభివృద్ధికి పాటుపడేలా చైతన్య పరచాలనిసూచించారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>