కలం, కరీంనగర్ బ్యూరో : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి (Peddapalli) లో నిర్వహించిన ఉద్యోగ సాధన మేళా విజయవంతంగా ముగిసింది. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ సాధన మేళాలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఉద్యోగ సాధనమేళా ఏర్పాటు చేసి జిల్లా యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టాస్క్, జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఈ ఉద్యోగ అవకాశాలను యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం యూత్ పార్లమెంట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేక మెమెంటోలను అందజేసి అభినందించారు. అదేవిధంగా, ఈ మెగా జాబ్ మేళాలో వివిధ ఉద్యోగాలకు ఎంపికైన అర్హులైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ఎ. సురేష్, జిల్లా ఎంప్లాయ్‌మెంట్ అధికారి ఎం.రాజశేఖర్ , కీర్తికాంత్ , టాస్క్ డీట్ అధికారి కౌసల్య , ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, వైస్ ప్రిన్సిపాల్, ట్రైనింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు, పీఈటీ కుమార్, పీఈటీ దుర్గాప్రసాద్, వివిధ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

