కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట (Siddipet) ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్ (junior doctor) లావణ్య ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వ్యక్తిగత కారణాలతో మనస్తాపానికి గురైన ఆమె, గడ్డి మందును ఇంజెక్షన్ రూపంలో తీసుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఘటన వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన లావణ్య సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో జూనియర్ డాక్టరుగా విధులు నిర్వహిస్తున్నారు. గత శుక్రవారం ఆమె గడ్డి మందును మూడు డోసులుగా నేరుగా నరానికి ఇంజెక్షన్ రూపంలో తీసుకున్నారు. విషయాన్ని గమనించిన తోటి సిబ్బంది వెంటనే ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు.
పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ శనివారం రాత్రి లావణ్య కన్నుమూశారు. సమాచారం అందుకున్న సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.

Read Also: సీనియర్ నటి రాశికి క్షమాపణలు చెప్పిన అనసూయ..
Follow Us On: Pinterest


