కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట (Siddipet) జిల్లాను రద్దు చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, లేనిపక్షంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరో భారీ పోరాటానికి సిద్ధమవుతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
గత కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలకు పాలనను చేరువ చేయాలనే ఉద్దేశంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని నాయకులు గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద ఉన్న కోపంతో, రాజకీయ కుట్రలో భాగంగా జిల్లాలను రద్దు చేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తాము ఎంతటి త్యాగానికైనా సిద్ధమని, జిల్లాను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని స్పష్టం చేశారు.
జిల్లా మంత్రిగా ఉండి పొన్నం ప్రభాకర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. హుస్నాబాద్‌ను సిద్దిపేట జిల్లా నుండి వేరు చేసి కరీంనగర్‌లో కలుపుతామని, జిల్లాలను రద్దు చేస్తామని చెప్పడం ప్రజలను వంచించడమేనని వారు మండిపడ్డారు. సొంత జిల్లా ప్రయోజనాలను కాపాడాల్సిన మంత్రే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అన్యాయమని వారు పేర్కొన్నారు.
సిద్దిపేట (Siddipet) జిల్లాను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని నాయకులు హెచ్చరించారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న జిల్లాను రాజకీయ కారణాలతో అస్థిరపరచాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: సీఎం ఆఫీస్ నుంచే ఘోస్ట్ సైట్లు: మాజీ మంత్రి సంచలన ఆరోపణలు
Follow Us On: Instagram


