కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తికానుండటంతో, సీఎం మార్పు అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ముందస్తుగా జరిగిన ఒప్పందం ప్రకారం డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా నియమితులవుతారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. తాజాగా ఈ వార్తలపై సిద్దరామయ్య తనదైన రీతిలో స్పందించారు. “హైకమాండ్ ఈ విషయంపై ఏమైనా చెప్పిందా? మీడియా ఏదో రాస్తుంది? దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అన్నారు. ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
‘2.5-2.5’ ఫార్ములా మళ్లీ తెరమీదకు
2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో “2.5-2.5 ఫార్ములా” అనే సూత్రం బలంగా వినిపించింది. మొదటి రెండున్నరేళ్లు సిద్ధరామయ్య, తర్వాత రెండున్నరేళ్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం అవుతారన్న అప్రకటిత ఒప్పందం ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ హైకమాండ్ ఈ విషయంపై ఎప్పుడూ అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పుడు ఆ గడువు సమీపిస్తుండటంతో, ఆ ఒప్పందం నిజమేనా? లేక అంతా ఊహాగానమా? అన్న సందేహాలు మరోసారి చర్చకు దారితీశాయి.
డీకే శిబిరం వాదన ఇదే..
కర్ణాటకలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) రాజకీయంగా బలంగా ఉన్నారు., ఆయనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలు కూడా అధికంగానే ఉన్నారు. వోకలిగ కమ్యూనిటీలో పాత మైసూరు ప్రాంతంలో ఆయనకు మద్దతు ఉంది. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయనకు బహిరంగంగానే మద్దతు పలుకుతున్నారు.
డీకే కూడా గతంలో “నాకు సీఎం కావాలనే కోరిక ఉంది” అని పలుమార్లు ప్రకటించారు. “పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం” అని కూడా డీకే చెబుతుండటం గమనార్హం.
సిద్ధరామయ్య(Siddaramaiah) రాజకీయంగా అనుభవజ్ఞుడు. తన పదవిని కాపాడుకోవడంలో సిద్దహస్తుడు. ఎప్పుడు ఏ మాట చెప్పాలో బాగా తెలుసు. సిద్దరామయ్య వ్యూహాత్మకంగా తన పదవిని కాపాడుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అధిష్ఠానం ముఖ్యమంత్రిని మార్చాలని భావిస్తున్నా.. అందుకు సిద్దరామయ్య ఒప్పుకోవడం లేదని సమాచారం. దీంతో రాష్ట్రంలో ఏదైనా అలజడి చెలరేగే అవకాశం ఉందని హైకమాండ్ మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. గవర్నర్ల వ్యవస్థ పరోక్షంగా ఆ పార్టీ కంట్రోల్ లోనే ఉంటుంది. అందుకే ముఖ్యమంత్రి మార్పు విషయంలో హైకమాండ్ సాహసం చేయలేకపోతున్నదని సమాచారం.
కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రస్తుత పరిస్థితిని దగ్గరగా పరిశీలిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ స్థిరత్వం, మరోవైపు నాయకత్వ వారసత్వం మధ్య సమతుల్యం పాటించడమే వారికి ప్రధాన సవాల్. అందుకే ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్, ఇటు సిద్దరామయ్య ఎవరికి వారు తమ వ్యూహాలను అవలంభిస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Read Also: మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం, మరో 6 నెలలు కాల్పుల విరమణ
Follow Us On : Instagram

