epaper
Tuesday, November 18, 2025
epaper

మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం, మరో 6 నెలలు కాల్పుల విరమణ

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కాల్పుల విరమణ(Ceasefire)ను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు పార్టీ లేఖ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ పేరుతో ఈ లేఖ విడుదలైంది. మావోయిస్టు పార్టీ గత మే నెలలోనే ఆరు నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటించింది. ఆ సమయంలో “ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా కృషి చేస్తాం” అని ప్రకటించింది. తాజాగా విడుద చేసిన లేఖలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ప్రజల ఆకాంక్షల మేరకు మరో ఆరు నెలల పాటు విరమణ కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.

లేఖలో ఉన్న ముఖ్యాంశాలు

గత ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు, సామాజిక సంఘాల కృషి వలన శాంతియుత వాతావరణం నెలకొన్నదని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం కూడా శాంతి కోసం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్పందించిందని తెలిపింది. అదే వాతావరణం కొనసాగాలనే ఆశతో మరో ఆరు నెలల విరమణను ప్రకటిస్తున్నామని చెప్పింది. తమవైపు నుంచి కూడా శాంతిని కాపాడేందుకు కృషి చేస్తామని వెల్లడించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలోని శాంతి వాతావరణాన్ని భంగం చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించింది. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు, సామాజిక వర్గాలు, విద్యార్థులు, మేధావులు కలసి పోరాడాలని పిలుపునిచ్చింది.

మావోయిస్టుల వ్యూహం ఏమిటి?

ఈ నిర్ణయం మావోయిస్టు పార్టీ వ్యూహాత్మకంగా తీసుకున్న ఒక తాత్కాలిక నిర్ణయమని నిపుణులు భావిస్తున్నారు. ఈ విరమణ ద్వారా తాత్కాలికంగా హింసాత్మక చర్యలు నిలిపి, మళ్లీ తమ బలాన్ని పునర్నిర్మించుకునే అవకాశం పొందవచ్చని మావోయిస్టు పార్టీ వ్యూహంగా ఉంది. ప్రజల నుంచి కొంత సానుభూతి పొందడం, ప్రజలు, ప్రజాసంఘాల అభిప్రాయాలను గౌరవిస్తున్నామని ప్రజల్లోకి ఒక సంకేతం పంపేందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా మావోయిస్టు కార్యకలాపాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగిస్తోంది. కాల్పుల విరమణ(Ceasefire) వల్ల అటవీ ప్రాంతాల్లో ప్రజల భయం కొంత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ స్పందన ఎలా ఉండబోతోంది?

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను లేకుండా చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఎందరో మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారు. కీలక నేతలు లొంగిపోయారు. అతిత్వరలోనే భారత్ ను మావోయిస్టు రహిత దేశంగా ప్రకటిస్తామని కేంద్రం చెబుతోంది. ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఓ వైపు కీలక నేతలు లొంగిపోవడం, మరికొందరు ఎన్ కౌంటర్లలో చనిపోవడం, కొత్తగా రిక్రూట్ మెంట్లు ఏమీ లేకపోవడాన్ని బట్టి చూస్తే మావోయిస్టు పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. అందువల్ల, ఈ కాల్పుల విరమణను కేంద్రం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చని భద్రతా వర్గాలు అంటున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Read Also: అణ్వాయుధ పరీక్షపై ట్రంప్ సంచలన ప్రకటన

Follow Us On : Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>