రాజస్థాన్‌లోని జైపూర్(Jaipur)లో ఘోర విషాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఒక డంపర్ ట్రక్కు వరుసగా వాహనాలను ఢీకొట్టడంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. జైపూర్‌లోని హర్మారా పోలీస్‌స్టేషన్ పరిధిలోని లోహా మండీ, సికార్ రోడ్డుపై జరిగింది. డ్రైవర్ మద్యం సేవించి వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ముందుగా ఒక కారును ఢీకొట్టిన అనంతరం ఆగకుండా వరుసగా మరో నాలుగు వాహనాలను ఢీకొట్టాడు. ఆ తర్వాత కూడా ఆగక, ట్రక్కును దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వరకూ నడిపినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో రోడ్డుపై ఉన్న పాదచారులు, బైక్‌లు, కార్లు అన్నీ దాని బారిన పడ్డాయి.
ప్రమాద తీవ్రత కారణంగా కొన్ని వాహనాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యాయి. కొంతమంది కార్ల కింద చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తమవుతుండగా, స్థానికులు, రెస్క్యూ టీమ్ వారిని బయటకు తీయడానికి శ్రమిస్తున్నాయి. గాయపడిన వారిని స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు.
హర్మారా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. “ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, సుమారు 40 మందికి పైగా గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స కోసం జైపూర్(Jaipur)లోని వివిధ ఆసుపత్రులకు తరలించాం” అని పోలీసులు తెలిపారు.
డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతను మద్యం సేవించి వాహనం నడిపినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. ప్రమాదం కారణంగా ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. రోడ్డు మొత్తాన్ని మూసివేసి వాహనాలను మళ్లించగా, రక్షణ సిబ్బంది మిగిలిన బాధితులను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు.
స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “తాగి వాహనం నడిపే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని” వారు డిమాండ్ చేశారు. ఈ ఘటన రోడ్డు భద్రతపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తింది. భారీ వాహనాలపై నియంత్రణ లేకపోవడం, తాగి వాహనం నడపడం వంటి అంశాలపై అధికారులు మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Read Also: కర్ణాటక సీఎం మార్పు ఉందా? లేదా? సిద్దరామయ్య స్పందన ఇదే..
Follow Us On : Instagram

