కలం, వెబ్ డెస్క్: రాజస్థాన్ రాయల్స్‌తో జైపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా రాణించారు. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో పరుగులు పారించాడు. ఓపెనర్ సాయి సుదర్శన్, గిల్ ఇద్దరూ కలిసి స్కోర్‌ను వంద దాటించారు. ఆ తర్వాత సుదర్శన్ ఔట్ అయినా గిల్ మాత్రం తన పరుగుల వరదను కొనసాగించాడు. కాగా 84 పరుగుల దగ్గర బ్రిజేష్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యి వెనుదిరిగాడు. కానీ గిల్ ఇచ్చిన ఊపును మిగిలిన వారు కూడా కొనసాగించారు. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 229 స్కోర్ చేసింది. దీంతో గుజరాత్ ఈ సీజన్‌లోనే అత్యుత్తమ స్కోర్లలో ఒకటి నమోదు చేసింది. ఇక బౌలర్ల విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు అందరూ పరుగులు సమర్పించుకున్నారు. జడేజా, రాజ్ పుంజా మాత్రం పర్వాలేదన్న బౌలింగ్ చేశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ ధాటిగా ప్రారంభించారు. వీరిద్దరూ రాజస్థాన్ బౌలర్లను ఏమాత్రం కనికరించకుండా బౌండరీల వర్షం కురిపించారు. సాయి సుదర్శన్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసి జట్టు స్కోరును 118 పరుగుల వద్ద నిలిపి యశ్‌రాజ్ పుంజా బౌలింగ్‌లో వెనుదిరిగారు. మొదటి వికెట్‌కే సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి గట్టి పునాది వేశారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ గిల్ ఏమాత్రం తగ్గలేదు. 44 బంతులు ఎదుర్కొన్న ఆయన 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించారు. జోస్ బట్లర్ (13) త్వరగానే అవుట్ అయినా, గిల్ తన జోరు తగ్గించలేదు. చివరకు బ్రిజేష్ శర్మ బౌలింగ్‌లో దేశ్‌పాండేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. అప్పటికే జట్టు స్కోరు 185 పరుగులకు చేరుకుంది.

