Mobile Popup Ad
Mobile Popup Ad

గాడిలో పడ్డ గుకేశ్ ఆట.. ఉత్కంఠగా బ్లిట్జ్ పోరు!

కలం, వెబ్ డెస్క్:  వార్సా వేదికగా జరుగుతున్న ‘సూపర్ రాపిడ్ అండ్ బ్లిట్జ్’ టోర్నీలో భారత యువ సంచలనం, వరల్డ్ ఛాంపియన్ డి. గుకేశ్ (Gukesh) పట్టుదలతో పోరాడుతున్నారు. బ్లిట్జ్ విభాగం మొదట్లో తడబడినా, చివర్లో అద్భుత విజయాలతో గుకేశ్ మళ్లీ రేసులోకి వచ్చారు. ప్రస్తుతం సగం రౌండ్లు ముగిసేసరికి ఆయన 13 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. టోర్నీలో మూడో రోజైన బ్లిట్జ్ విభాగం గుకేశ్‌కు అంత ఆశాజనకంగా మొదలవ్వలేదు. ప్రారంభంలోనే రడోస్లా వోయిటాజెక్, ఫిరోజా అలీరెజా చేతుల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఫాబియానో ​​కరువానా, జావోఖిర్ సిందరోవ్‌లతో జరిగిన పోటీల్లోనూ పరాజయం ఎదురైంది. ముఖ్యంగా రాపిడ్ విభాగంలో గుకేశ్ చేతిలో ఓడిపోయిన సిందరోవ్, బ్లిట్జ్ రౌండ్‌లో తిరిగి విజయం సాధించడం గమనార్హం.

వరుస ఓటములతో వెనుకబడిన దశలో గుకేశ్ తన అసలైన ఆటను ప్రదర్శించారు. టోర్నీలో అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఆటగాడు హన్స్ నీమన్‌ను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అదే జోరును కొనసాగిస్తూ తొమ్మిదో రౌండ్‌లో పోలాండ్‌కు చెందిన జాన్-క్రిజిస్టాఫ్ దుడాపై ఘనవిజయం సాధించారు. ఈ విజయాలతో తన పాయింట్ల సంఖ్యను 13కు పెంచుకుని ముందంజ వేశారు. ప్రస్తుతం అమెరికాకు చెందిన హన్స్ మోక్ నీమన్ 16.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆయన తర్వాత స్థానాల్లో వెస్లీ సో (16 పాయింట్లు), ఫాబియానో ​​కరువానా, వ్లాదిమిర్ ఫెడోసీవ్ (చెరో 15 పాయింట్లు) ఉన్నారు. ఫ్రాన్స్ ఆటగాళ్లు ఫిరోజా అలీరెజా, మాగ్జిమ్ వాచియర్-లగ్రావ్‌లతో పాటు దుడా 12.5 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచారు. సిందరోవ్ 12 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో, వోయిటాజెక్ 10 పాయింట్లతో పదో స్థానంలో ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>