కలం, వెబ్ డెస్క్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి ( Bandi Sanjay Son ) పై నమోదైన పోక్సో (POCSO) కేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై బండి భగీరథ్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం అందుతుండగా.. తనపై సదరు మైనర్ బాలిక కుటుంబం హనీ ట్రాప్ చేసిందని ఆరోపిస్తూ బండి భగీరథ్ పీఎస్ లో ఫిర్యాదు చేయడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై ఈ ఆరోపణలు మొదటిది కాదని, గతంలో కూడా అతనిపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ మేరకు వివాదస్పదంగా మారిన బండి సంజయ్ కుమారుడి వీడియోలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ అధినాయకత్వంపై పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు. విలువలు, సంస్కృతి గురించి నీతులు చెప్పే బీజేపీ దీనిపై ఎలా స్పందిస్తుందని పలు పార్టీల నేతలు అంటున్నారు. మైనర్ బాలిక ఫిర్యాదు తర్వాత పోక్సో కేసు నమోదు కావడంతో హనీ ట్రాప్ అంటూ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రానున్న రోజుల్లో కేసును క్లోజ్ చేయెచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ కుమారుడి అంశం రాజకీయ హీటెక్కిస్తున్న వేళ రేపు పీఎం మోదీ తెలంగాణ పర్యటనలో న్యాయం, బాధ్యత పై మాట్లాడతారా? మౌనం వహిస్తారా? ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వేళ బండి సంజయ్ కుమారుడి అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

