epaper
Friday, January 16, 2026
spot_img
epaper

రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాలా? ఇవే మంచి మార్గాలు..!

కలం, వెబ్ డెస్క్: డబ్బు సంపాదించడంపై ప్రస్తుతం యువతలో ఆసక్తి పెరుగుతోంది. అందుకోసం ఇన్నాళ్లు దూరంగా ఉన్న వారు కూడా ఇప్పుడు పెట్టుబడుల (Invest) మార్గం వైపు అడుగులు వేస్తున్నారు. చాలా మంది 2026ను పెట్టుబడులు స్టార్ట్ చేయాలన్న రెజెల్యూషన్‌తో కూడా స్టార్ట్ చేశారు. కానీ దాదాపు చాలా మందికి ఉన్న సమస్య, ప్రశ్న.. పెట్టుబడి ఎలా పెట్టాలి? ఎందులో పెట్టాలి? మరికొందర తమ దగ్గర కొంత మొత్తం డబ్బు ఉంది.. దానిని పెట్టుబడిగా ఎలా మర్చుకోవాలి? అనేది తెలియదు. గత ఏడాది మార్కెట్లు ఆశించిన స్థాయిలో నడవకపోయినా, దీర్ఘకాల దృష్టితో చూస్తే ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మోడరేట్ రిస్క్ తీసుకునేవారు మొత్తం డబ్బును ఒకే చోట పెట్టకుండా విభిన్న మార్గాల్లో పెట్టుబడిని విస్తరించడం ఉత్తమం అని సూచిస్తున్నారు.

ఈక్విటీకి తగ్గని ప్రాధాన్యం

మార్కెట్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే 2026లో మోడరేట్ ఇన్వెస్టర్లు కనీసం 40 శాతం నుంచి గరిష్ఠంగా 70 శాతం వరకు ఈక్విటీలో పెట్టుబడి పెట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫ్లెక్సీ క్యాప్, మల్టీక్యాప్ ఫండ్స్, మార్కెట్ మార్పులకు అనుగుణంగా పెట్టుబడులను సర్దుబాటు చేసే స్వేచ్ఛ ఇస్తాయి. రిస్క్ కంట్రోల్‌లోనే రూ.10 లక్షల మొత్తాన్ని పూర్తిగా ఈక్విటీలో పెట్టడం సరైన వ్యూహం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈక్విటీతో పాటు డెట్, గోల్డ్, వెండి, అంతర్జాతీయ ఫండ్స్ చేర్చితే పోర్ట్‌ఫోలియోకు సమతుల్యత వస్తుందని చెబుతున్నారు. డెట్ భాగం స్థిరత్వాన్ని ఇస్తే, గోల్డ్, వెండి మార్కెట్ ఒడిదుడుకుల సమయంలో భద్రతగా నిలుస్తాయి.

నిపుణుల మాటల్లో పెట్టుబడి వ్యూహం

వెంచురా సిక్యూరిటీస్‌కు చెందిన జూజర్ గబాజీవాలా ఫ్లెక్సీ క్యాప్, మల్టీక్యాప్ ఫండ్స్‌తో పాటు ఇంటర్నేషనల్ ఈక్విటీ ఫండ్స్‌ను కూడా పరిశీలించాలని సూచిస్తున్నారు. విదేశీ మార్కెట్ల వృద్ధి నుంచి లాభపడే అవకాశం దీనివల్ల వస్తుందని ఆయన చెబుతున్నారు. డెట్ భాగాన్ని మల్టీ అసెట్ ఫండ్స్‌లో పెట్టడం ద్వారా పన్ను ప్రయోజనం కూడా లభిస్తుందని ఆయన అభిప్రాయం. SIFT క్యాపిటల్‌కు చెందిన వినీత్ నందా మోడరేట్ రిస్క్ తీసుకునేవారు కొంత ఎక్కువ ఈక్విటీ తీసుకున్నా, మల్టీ అసెట్ ఫండ్స్ ద్వారా సమతుల్యత సాధించవచ్చని చెబుతున్నారు. గోల్డ్‌తో పాటు REITలలో పెట్టుబడులు రియల్ ఎస్టేట్ రంగంలో పరోక్ష భాగస్వామ్యాన్ని కల్పిస్తాయని ఆయన వివరించారు. ఫిస్‌డామ్‌కు చెందిన నీరవ్ కర్కేరా దీర్ఘకాల లక్ష్యాలు ఉన్నవారు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ సరైన మిశ్రమాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. అంతర్జాతీయ ఫండ్స్, కమోడిటీలను జోడిస్తే పోర్ట్‌ఫోలియో మరింత స్థిరంగా మారుతుందని ఆయన చెబుతున్నారు.

SIP ఎందుకు సురక్షితం?

ఒకేసారి మొత్తం డబ్బు పెట్టడం కంటే SIP పద్ధతిలో దశలవారీగా పెట్టుబడులు పెట్టడం ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణుల అభిప్రాయం. మార్కెట్ పడినప్పుడు ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేసే అవకాశం లభిస్తే, మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు కొనుగోలు అవుతాయి. దీని వల్ల సగటు ఖర్చు నియంత్రణలో ఉంటుంది.

ప్రతి ఏడాది రివ్యూ చేయాలి

పెట్టుబడులు పెట్టిన తర్వాత వాటిని అలాగే వదిలేయడం సరైన పద్ధతి కాదు. ప్రతి ఏడాది పోర్ట్‌ఫోలియోను సమీక్ష చేసి, అవసరమైతే రీబ్యాలెన్సింగ్ చేయాలి. లక్ష్యాలు మారితే పెట్టుబడి వ్యూహం కూడా మారాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. 2026లో పెట్టుబడులు అంటే తక్షణ లాభాల కోసం తీసుకునే నిర్ణయాలు కాదు. సరైన డైవర్సిఫికేషన్, క్రమశిక్షణ, దీర్ఘకాల ఆలోచన ఉంటే మార్కెట్ ఒడిదుడుకుల మధ్య కూడా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టే ముందు వ్యక్తిగత అవసరాలు, ఆదాయం, రిస్క్ సామర్థ్యాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>