కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా కొన్ని రోజుల నుంచి నిలిచిపోయిన విమానాల రాకపోకలు పాక్షికంగా ప్రారంభమయ్యాయి (Flights Resume Partially). దుబాయ్, అబుదాబి విమానాశ్రయాల నుంచి పరిమిత సంఖ్యలో కార్యకలాపాలు మొదలయ్యాయి. సోమవారం సాయంత్రం అబుదాబి నుంచి బయలుదేరిన ఓ విమానం రాత్రి ఢిల్లీకి చేరుకుంది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్24 సమాచారం ప్రకారం, ఎతిహాద్ ఎయిర్‌వేస్ EY216 విమానం అబుదాబి నుంచి మధ్యాహ్నం 3:42 గంటలకు బయలుదేరి, రాత్రి 8:31 గంటలకు న్యూఢిల్లీకి చేరింది.
ఇజ్రాయెల్–అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడుల కారణంగా గల్ఫ్ కంట్రీస్ గగనతలంపై నిషేధం విధించడంతో విమానాల రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. వీళ్ల క్షేమ సమాచారాలు, తిరిగి స్వదేశానికి రావడంపై కుటుంబ సభ్యుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఫ్లైట్స్ పాక్షికంగా ప్రారంభం కావడం ఊరటనిచ్చే అంశం.
ఎతిహాద్తోపాటు ఫ్లైదుబాయ్, ఎమిరేట్స్ సంస్థలు పరిమితి సంఖ్యలో సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపాయి(Flights Resume Partially). ఇప్పటికే బుకింగ్ ఉన్న ప్రయాణికులకు ప్రాధాన్యత ఇస్తామని, రీబుక్ చేసిన వారికి నేరుగా సమాచారం ఇవ్వనున్నట్లు ఆ సంస్థలు తెలిపాయి. సమాచారం అందకపోతే విమానాశ్రయానికి రావద్దని స్పష్టం చెప్పాయి.
కాగా, సోమవారం అబుదాబి నుంచి మూడు గంటల వ్యవధిలో కనీసం 15 ఎతిహాద్ ప్రయాణికుల విమానాలు బయలుదేరాయి. ఉద్రిక్తతల ప్రారంభం నుంచి అక్కడే చిక్కుకుపోయిన ప్రయాణికులను తరలించేందుకు వీటిని నడిపినట్లు తెలుస్తోంది.
ఇక, ఎయిర్ ఇండియా సైతం రేపటి నుంచి మస్కట్‌కు, మస్కట్ నుంచి ఇండియాకు సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ, కొచ్చి, మంగళూరు, ముంబై, తిరుచ్చి ఎయిర్‌పోర్ట్స్‌కు షెడ్యూల్ ప్రకారం విమానాలు నడుస్తాయని తెలిపింది. అయితే బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలకు వెళ్లే, వచ్చే విమానాలు మార్చి 3 రాత్రి 11:59 గంటల వరకు నిలిపివేయనున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి వెల్లడించారు.

