కలం, వెబ్ డెస్క్ : ఆసిఫాబాద్ జిల్లా (Asifabad District) లోని వాంకిడి (Wankidi) మండలంలో పట్టపగలే దారుణ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. బ్యాంకు నుండి నగదు తీసుకుని వెళ్తున్న ఓ రైతును నలుగురు దుండగులు మోసగించి రూ.75,000 దోచుకెళ్లారు. వివరాలలోకి వెళ్తే.. ఓ రైతు బ్యాంకు నుండి రూ.75,000 నగదు డ్రా చేసుకొని తన బైక్‌పై ఇంటికి వెళ్తుండగా నలుగురు వ్యక్తులు అతడిని అనుసరించారు. మార్గం మధ్యలో ‘నీ బైక్ నుండి డబ్బులు కింద పడ్డాయి’ అని నమ్మించి అతడిని ఆపారు.
ఆ మాటలను నమ్మిన రైతు తన బైక్‌ను ఆపి పరిశీలించగా, దుండగులు అదే సమయంలో బైక్‌లోని కవర్‌లో ఉంచిన నగదును చాకచక్యంగా కాజేసి అక్కడి నుంచి పరారయ్యారు. క్షణాల్లో జరిగిన ఈ మోసంతో రైతు షాక్‌కు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని సేకరించి దుండగుల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. పట్టపగలే జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్లే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also: నిజామాబాద్‌లో జోరుగా తాటి ముంజల విక్రయాలు
Follow Us On : WhatsApp

