నిజామాబాద్‌లో జోరుగా తాటి ముంజల విక్రయాలు

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్‌ (Nizamabad) లో మండే ఎండల మధ్య చల్లటి తాటి ముంజలకు (Ice Apples) భారీ డిమాండ్ ఏర్పడింది. వేసవికాలంలో మాత్రమే దొరికే ఈ సహజ శీతల పండును కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. నగరంలోని రోడ్ల పక్కన ఎటు చూసినా తాటి ముంజల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. భీంగల్, వేల్పూర్, కమ్మర్‌పల్లి, డొంకేశ్వర్, ఆలూరు వంటి మండలాల నుంచి వ్యాపారులు తాటి ముంజలను తీసుకొచ్చి నిజామాబాద్ నగరంలో అమ్ముతున్నారు. ప్రస్తుతం డజన్ తాటి ముంజలను సుమారు రూ.100కు విక్రయిస్తున్నారు. ఒక్క రోజులోనే వందల సంఖ్యలో ముంజలను విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. గ్రామాలలో తాటి చెట్ల యజమానులతో ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకుని, చెట్టు వారీగా డబ్బులు చెల్లించి ముంజలను సేకరించి నగరానికి తీసుకువస్తున్నారు.

ప్రజలు కూడా వీటిని విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్కరు డజన్ నుంచి రెండు, మూడు డజన్‌ల వరకు తీసుకెళ్తున్నారు. వేసవిలో శరీరాన్ని చల్లబరచే సహజ పానీయంగా తాటి ముంజలు మారాయి. ఆరోగ్యపరంగా కూడా తాటి ముంజలు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో సుమారు 90 శాతం నీరు ఉండటం వల్ల శరీరాన్ని వెంటనే చల్లబరుస్తాయి. వడదెబ్బ నుంచి రక్షణ కలిగించడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అసిడిటీ, మలబద్ధకం, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటంతో బరువు నియంత్రణలో ఉంచుతాయి. అలాగే చర్మ సమస్యలు తగ్గించి, శరీరానికి తక్షణ శక్తినిస్తాయి.

100 గ్రాముల తాటి ముంజలలో  సుమారు 43 కేలరీలు, 10.9 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 200 మిల్లీగ్రాముల పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినవచ్చు. రోజుకు 3–4 ముంజలు తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే జలుబు, దగ్గు ఉన్నవారు తక్కువగా తీసుకోవాలని, షుగర్ ఉన్నవారు మితంగా తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>