కలం, వరంగల్ బ్యూరో: చికెన్ (Chicken) ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మూడు నెలలుగా రూ. 260 ఉన్న బ్రాయిలర్ ధర రెండు వారాల్లోనే రూ. 320కి చేరింది. కోడి మాంసమే కాదు కోడి గుడ్ల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం మార్కెట్ లో గుడ్డు ధర రూ 8 పలుకుతోంది. పెరిగిన చికెన్, గుడ్ల ధరలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ పల్లెల్లో చికెన్ వినియోగం ఎక్కువ. ఆదివారంతో పాటు వారానికి రెండు, మూడు రోజులు పక్కా మాంసం ఉండాల్సిందే. పండుగొచ్చినా , ఇంటికి చుట్టం వచ్చినా కోడి కూర వండాలిసిందే. ఈ నేపథ్యంలో సంక్రాంతి సీజన్ ప్రారంభం కావడంతో చికెన్ ధరలు మండిపోతున్నాయి. దీనికి తోడు ఈ నెలలోనే మేడారం జాతర ఉండడం, సమ్మక్క సారలమ్మకు మొక్కులు సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో కోళ్లు కోయడం అనవాయితీ. ఈ నేపథ్యంలో కోళ్ల ధరలకు తోడు చికెన్ కు డిమాండ్ పెరుగుతోంది.
ఇటీవల తెలంగాణ (Telangana)లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చికెన్ వినియోగం బాగా పెరిగింది. గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసినవాళ్లు కొన్నిచోట్ల ఓట్లు రాబట్టుకునేందుకు చికెన్ పంపిణీ చేశారు. చలికాలంలో చికెన్ వినియోగం ఎక్కువగానే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. కోళ్ల ఫారాల్లో దాణా ఖర్చులు పెరగడంతో రవాణా ఖర్చులు అధికమయ్యాయి. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటం కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో చికెన్ ధరలు కిలో రూ. 400 పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.


