కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ (Nalgonda) పోలీస్ శాఖ సరికొత్త ప్రయోగాన్ని అమలు చేయబోతోంది. జాతీయ రోడ్డు భద్రతా-2026 మాసోత్సవాల్లో భాగంగా ‘నో హెల్మెట్.. నో పెట్రోల్’ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అందులో భాగంగానే పెట్రోల్ బంక్ నిర్వాహకులు, యాజమాన్యాలతో ఇప్పటికే సమావేశమై అవగాహన కల్పించింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సైతం పోలీస్ శాఖ రిలీజ్ చేసింది. అయితే ఈ ప్రయోగం ఎంత మేరకు అమలవుతుందనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే.. ఇప్పటికీ జిల్లాలో 80 శాతం మంది వాహనదారులు హెల్మెట్ వినియోగించడం లేదు. పోలీసు పెట్రోలింగ్, ఇతర సిబ్బందే హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్తున్నారు.
కొన్ని సందర్భాల్లో సెల్‌ఫోన్ (Cellphone) డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ ఇవన్నీ కామన్ అయిపోయాయి. వాస్తవానికి నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తీసుకున్న నిర్ణయం మంచిదే. ఇది సొంత శాఖ నుంచి మొదలుపెడితే.. అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. అయితే నో హెల్మెట్.. నో పెట్రోల్.. నినాదానికి బంక్ యాజమాన్యాలు సహకరించడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే.. పెట్రోల్ బంక్‌కు వచ్చే ద్విచక్ర వాహనదారుల్లో నూటికి 90 శాతం మంది హెల్మెట్ లేనివారే. వారందరినీ పెట్రోల్ పోయకుండా వెనక్కి పంపడం కష్టమే. ఈ ప్రయత్నం సక్సెస్ అయితే మాత్రం రోడ్డు ప్రమాదాల్లో (Road Accidents) ప్రాణనష్టం తగ్గడం ఖాయం. కానీ ఎలా అమలవుతుందనేది వేచి చూడాల్సిందే..


