కలం, వెబ్‌డెస్క్: భారత మహిళల జట్టు డాషింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ (Shafali Verma) ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైంది. ఈ ఏడాది నవంబర్ నెలకు గాను ఈ అవార్డుకు షెఫాలీని ఐసీసీ(ICC) ఎంపిక చేసింది. మహిళల ప్రపంచ కప్ గెలవాలన్న భారత జట్టు కల ఈ ఏడాదిలో నెరవేరిన సంగతి తెలిసిందే. ఈ గెలుపులో షెఫాలీ కీలక పాత్ర పోషించింది. మరో ఓపెనర్ ప్రతీకా రావల్ గాయపడడంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన షెఫాలీ సెమీస్, ఫైనల్లో ఆడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో షెఫాలీ బ్యాటింగ్‌లో దూకుడుగా ఆడి 78 బంతుల్లో 87 పరుగులు చేసింది. జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచింది. అలాగే బౌలింగ్‌లో ఏడు ఓవర్లు వేసి 36 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టింది. ఈ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు గాను షెఫాలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
కాగా, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కడంపై షెఫాలీ వర్మ (Shafali Verma) సంతోషం వ్యక్తం చేసింది. భారత జట్టు సుదీర్ఘ కలను నెరవేర్చడంలో తాను భాగం అయినందుకు హ్యాపీగా ఉన్నట్లు తెలిపింది. తన ప్రయాణానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు పేర్కొంది. కాగా, పురుషుల విభాగంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్(Simon Harmer)ను ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ వరించింది. భారత్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో హార్మర్ 17 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. తమ జట్టు క్లీన్‌స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు.
Read Also: కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన తిలక్ వర్మ
Follow Us On: Sharechat


