epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

గిరిజన ప్రాంతంలో జాతీయ కబడ్డీ పోటీలు.. గర్వకారణమ‌న్న మంత్రి పొంగులేటి

క‌లం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న 69వ ఎస్.జి.ఎఫ్ (SGF) అండర్-17 బాలుర జాతీయ కబడ్డీ (Kabaddi) పోటీలు మూడో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో జరిగిన మ్యాచ్‌ల్లో వివిధ రాష్ట్రాల జట్లు తలపడటంతో ఆట ఉత్కంఠభరితంగా సాగింది. మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా అలరించింది.

పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న ఈ పోటీలను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రికి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్‌తో కలిసి మంత్రి క్రీడలను ఆసక్తిగా వీక్షించారు.

ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తూ.. కబడ్డీ (Kabaddi) వంటి సంప్రదాయ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని కొనియాడారు. జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనడం క్రీడాకారుల కెరీర్‌లో ఒక ముఖ్యమైన ఘట్టమని, గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

మారుమూల గిరిజన ప్రాంతంలో ఇంతటి భారీ క్రీడా వేడుక జరగడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 32 రాష్ట్రాల నుండి దాదాపు 384 మంది క్రీడాకారులు, 74 మంది కోచ్‌లు, జడ్జీలు పాల్గొంటున్నారని తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్న జిల్లా యంత్రాంగాన్ని, క్రీడా శాఖ అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>