కలం, వెబ్ డెస్క్: వాళ్లంతా అడవి బిడ్డలు (Tribal Villagers).. తమకు ఎన్నో సమస్యలు ఉన్నాయని.. తమ గ్రామాలకు రోడ్లు లేవని.. విద్యుత్ సౌకర్యం లేదని.. తమకు ఏ అధికారి పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఎన్ని సార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. దీంతో వినూత్న నిరసనకు దిగారు. సమస్యలను పరిష్కరించాలంటూ ఉరితాళ్లు బిగించుకొని నిరసన తెలిపారు.
విజయనగరం జిల్లా గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల్లో ఆదివాసీలు (Tribal Villagers) వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు మెడకు ఉరి తాళ్లు బిగించుకొని నిరసనకు దిగారు. ఈ నిరసనలో పలు గ్రామాలకు చెందిన ఆదివాసీలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలు పట్టుకొని తమ నిరసనను తెలియజేశారు.
గోపాలరాయుడుపేట పంచాయతీలోని కృపా వలస, రమణ వలస, దీవెన వలస, సీయోను వలస, చిన్నాకిన వలస గ్రామాల్లో సుమారు 100 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామాలకు సంబంధించిన పలు సమస్యలు చాలా కాలంగా పరిష్కారానికి నోచుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. తాము ఎన్నిసార్లు విన్నవించినా సంబంధిత ట్రైబల్ అధికారులు కనీసం తమవైపు చూసే పరిస్థితి లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేకంగా గిరిజనుల సంక్షేమానికి ఏర్పాటు చేసిన శాఖ ఉన్నప్పటికీ, తమ సమస్యలు అధికారుల దృష్టికి రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు, పథకాల అమలులో నిర్లక్ష్యం కొనసాగుతుందని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు స్పందించకపోవడంతో, చివరకు ఈ తరహా తీవ్ర నిరసనకు దిగాల్సి వచ్చిందని తెలిపారు.
తమపై జరుగుతున్న అన్యాయాన్ని పాలకుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మెడకు ఉరి తాళ్లు బిగించుకొని నిరసన చేస్తున్నామని గ్రామస్తులు చెప్పారు. తమకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపినట్లు తెలిసింది.


