కలం, వెబ్డెస్క్: సంచలనం సృష్టించిన శబరిమల బంగారం చోరీ (Sabarimala gold theft) కేసులో ట్విస్ట్. ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరును దర్యాప్తు బృందం సిట్ శుక్రవారం అరెస్ట్ చేసింది. అంతకుముందు ఉదయం 4.30 గంటలకు ప్రధాన పూజారి ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు బంగారం చోరీ గురించి ప్రశ్నించారు. అనంతరం ఆయన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టిని ఆలయానికి తీసుకొచ్చింది ఆయనేని, అతనితో పూజారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. బంగారం చోరీ ఘటనలో పూజారి పాత్ర కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో అరెస్ట్ చేశారు.
శబరిమల ప్రధాన గర్భగుడికి ముందు భాగంలో ఉండే ద్వార పాలకుల విగ్రహాలపై బంగారు పూత పూసిన తాపడాలను ఆరేళ్ల కిందట మరమ్మతుల కోసం తొలగించారు. వాటిని సరిచేయించి, కొత్త బంగారు తాపడాలు అందిస్తానని ఉన్నికృష్ణన్ తీసుకెళ్లాడు. వాటిని ఓ సంస్థకు అప్పగించాడు. ఆ సంస్థ పని పూర్తి చేసి, తిరిగి ఆలయానికి తాపడాలను అందించినప్పుడు వాటి బరువు తగ్గినట్లు ఆలయ సిబ్బంది గుర్తించారు. మొదట 42.100 కిలోలుండగా, మరమ్మతు అనంతరం 4కిలోలు తగ్గినట్లు తేలింది. దీంతో బంగారం చోరీ (Sabarimala gold theft) జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో ఉన్నికృష్ణన్తోపాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్న సిట్.. ఈ ఉదంతంలో ఆలయ ప్రధాని పూజారి పాత్ర ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుంది. కాగా, సిట్ దర్యాప్తును కేరళ హైకోర్టు పర్యవేక్షిస్తోంది.


