కలం, వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చత్రుండ్ సమీపంలో ఒక మహీంద్రా బొలెరో వాహనం అదుపు తప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో డ్రైవర్‌తో పాటు ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. బాధితులంతా ఒక వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికారులు, స్థానిక ప్రజలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లోయలో నుంచి మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

