జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గాన్ని గెలుచుకోవడం కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం. సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవడం, నిలుపుకోవడం బీఆర్ఎస్ పార్టీకి కూడా ముఖ్యమే. ఇక భాగ్యనగరంలో సత్తా చాటాలంటే బీజేపీకి కూడా ఈ నియోజకవర్గం కీలకమే. అందుకే మూడు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే హోరాహోరీ కనిపిస్తోంది. అభ్యర్థిని కాస్త ఆలస్యంగా ప్రకటించిన బీజేపీ గెలుపు కోసం ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు సెటిలర్ల ఓట్లు అత్యంత కీలకం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సెటిలర్లు మొదట టీడీపీకి మద్దతు పలికారు. కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ వైపే మొగ్గుచూపుతూ వచ్చినట్టు కనిపించింది. సెటిలర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో 2019, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. అయితే ఈ సారి సెటిలర్లు అదే ఒరవడి కొనసాగిస్తారా? లేదంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతారా? అన్నది వేచి చూడాలి.
హైదరాబాద్ నగరంలోని మధ్యతరగతి, వ్యాపార వర్గాలు, ఉద్యోగులు అధికంగా నివసించే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సెటిలర్ల మెజార్టీగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గం బీఆర్‌ఎస్ గెలుచుకున్న ప్రాంతం. అప్పట్లో హైదరాబాదులో పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగంలో కేటీఆర్ నేతృత్వంలో చేపట్టిన పనుల ప్రభావంతో సెటిలర్ల ఓట్లు గణనీయంగా బీఆర్‌ఎస్ వైపుకే మళ్లాయి.
ఇప్పుడు మారిన సమీకరణాలు
అయితే 2023 ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సెటిలర్లు పునరాలోచనలో పడే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఉన్న సెటిలర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన అనుభవంతో వారితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల కమ్మ సామాజికవర్గం ఓ సమావేశం నిర్వహించి తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించింది. మరోవైపు టీడీపీ, జనసేన కూటమి బీజేపీకి మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సెటిలర్లు ఓట్లు ఏమైనా చీలుతాయా? లేదంటే వాళ్లంతా గుంపగుత్తంగా ఒకే పార్టీకి ఓటు వేస్తారా? అన్నది వేచి చూడాలి.
హైడ్రా కూల్చివేతల ప్రభావం ఏమిటి?
హైడ్రా కూల్చివేతలు ప్రభుత్వానికి అనుకూలమా? వ్యతిరేకమా? అన్న చర్చ కూడా సాగుతోంది. హైదరాబాద్ నగరంలో అనేక చెరువులు కాపాడామని, ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించామని హైడ్రా చెబుతోంది. అనేక కుంటలు, చెరువులను రక్షించామని చెబుతోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం హైడ్రా కేవలం పేదల ఇండ్లను మాత్రమే కూలుస్తోందని.. పెద్ద పెద్ద వాళ్ల జోలికి వెళ్లడం లేదని ఆరోపిస్తోంది. మరి హైడ్రా కూల్చివేతల ప్రభావం ఏమిటో వేచి చూడాలి. ప్రభుత్వం కేవలం చట్టవిరుద్ధ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నామని చెబుతుండగా, ఆస్తులు కోల్పోయిన లేదా నోటీసులు అందుకున్న వర్గం మాత్రం అసహనం వ్యక్తం చేస్తోంది.
సెటిలర్ల ఓట్లపై బీజేపీ ఆశలు
కూటమి తమకు మద్దతు ఇస్తోంది కాబట్టి సెటిలర్ల ఓట్లు తమకే పడతాయని బీజేపీ భావిస్తోంది. కానీ హోరాహోరీ పోరులో ఆ పరిస్థితి ఉంటుందా? ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోరు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా నడుస్తోంది. ఇక్కడ త్రిముఖ పోరు అన్ని డివిజన్లలో కనిపించడం లేదు. అనేక సర్వేల్లో బీజేపీ ఓటు బ్యాంక్ స్వల్పంగా ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం పథకాలతో లబ్ధి పొందిన వర్గం బీజేపీ వైపుకు మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీ అంచనా వేస్తోంది. హిందీ రాష్ట్రాల నుండి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డ వర్గం (ఉత్తర భారతీయులు, గుజరాతీలు, మార్వారీలు మొదలైన వారు) తమకు అనుకూలంగా ఉంటారని బీజేపీ చెబుతోంది.
కాంగ్రెస్‌కు సవాలు
సెటిలర్ల మనసు గెలుచుకోవడం కాంగ్రెస్‌కు ప్రధాన సవాలు. ఎంఐఎం మద్దతు, అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఉన్న పరిచయాలతో బస్తీలు, మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉంది. కానీ సెటిలర్ల ఓట్లు పొందడం కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారనున్నది. సెటిలర్ల ఓటు బ్యాంకు ఈ ఎన్నికల్లో నిర్ణాయకంగా మారనున్నది. మరి వారి ఓట్లు ఎవరికి పడతాయో వేచి చూడాలి.
Read Also: 22 నెలల పాలనలో చేసిందేంటి? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కిషన్ రెడ్డి
Follow Us On : Instagram

