లండన్ మారథాన్‌లో సెబాస్టియన్ సావే చరిత్ర..!

క‌లం, వెబ్‌డెస్క్‌: మారథాన్ చరిత్రలో సరికొత్త రికార్డ్ నమోదైంది. ఇంతవరకు ఎన్నడూ కనివినీ ఎరుగని రీతిలో కెన్యా అథ్లెట్ సెబాస్టియన్ సావే (Sebastian Sawe) చరిత్ర సృష్టించాడు. లండన్ వీధుల్లో జరిగిన పరుగులో సెబాస్టియన్ సావే రెండు గంటల కంటే తక్కువ సమయంలోనే లక్ష్యాన్ని చేరుకొని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఆదివారం జరిగిన లండన్ మారథాన్‌ (London Marathon)లో కెన్యాకు చెందిన సెబాస్టియన్ సావే కేవలం 1 గంట 59 నిమిషాల 30 సెకన్లలో పరుగును పూర్తి చేసి, ఈ ఘనత సాధించిన మొదటి అథ్లెట్‌గా రికార్డులకెక్కారు. 2023లో కెల్విన్ కిప్టమ్ నెలకొల్పిన 2:00:35 సెకన్ల రికార్డును సావే అధిగమించారు. విశేషమేమిటంటే, ఈ రేసులో మొదటి ముగ్గురు అథ్లెట్లు కూడా పాత ప్రపంచ రికార్డు కంటే తక్కువ సమయంలోనే పరుగును ముగించడం గమనార్హం.

మొదటి నుంచి ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించిన సావే, రేసు ముగింపు దశలో ఇథియోపియాకు చెందిన యోమిఫ్ కెజెల్చాతో గట్టి పోటీ పడ్డారు. చివరి మైలు దూరంలో వేగం పెంచి కెజెల్చాను వెనక్కి నెట్టారు. తొలిసారి మారథాన్‌లో పాల్గొన్న కెజెల్చా 1:59:41 సెకన్లతో రెండో స్థానంలో నిలవగా, ఉగాండాకు చెందిన జాకబ్ కిప్లిమో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. తన విజయంపై సావే స్పందిస్తూ.. క్రమశిక్షణ, సరైన సన్నద్ధత ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని నిరూపించానని తెలిపారు.

కొత్త తరం అథ్లెట్లకు ఇది ఒక స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎలియుడ్ కిప్చోగే కూడా రెండు గంటల లోపే మారథాన్ పూర్తి చేసినప్పటికీ, అది అధికారిక రేసు కాకపోవడంతో రికార్డుగా గుర్తించలేదు. మరోవైపు మహిళల విభాగంలోనూ రికార్డులు తిరగరాయబడ్డాయి. ఇథియోపియాకు చెందిన టిగ్స్ట్ అస్సెఫా 2:15:41 సెకన్లతో తన పాత రికార్డును తానే బద్దలు కొట్టారు. కెన్యా అథ్లెట్లు హెలెన్ ఒబిరి, జాయిసిలిన్ జెప్కోస్గీలతో చివరి వరకు పోరాడి అస్సెఫా విజేతగా నిలిచారు.

ఈ అద్భుత విజయంపై కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ప్రశంసలు కురిపించారు. సావే విజయం మానవ పట్టుదలకు నిదర్శనమని, ప్రపంచ క్రీడారంగంలో కెన్యా ఆధిపత్యాన్ని మరోసారి చాటిందని ఆయన కొనియాడారు. సాంకేతికత, ప్రతిభ తోడైతే క్రీడల్లో మరిన్ని అద్భుతాలు సాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>