జూలూరుపాడులో చెరకు తోట దగ్ధం

కలం, ఖమ్మం బ్యూరో :  మరో 20 రోజుల్లో చేతికి రావాల్సిన కష్టమంతా కళ్లెదుటే బూడిదైంది. అగ్నిప్రమాద రూపంలో వచ్చిన ముప్పు అన్నదాతల ఆశలను ఆవిరి చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సూరారం(Suraram) గ్రామంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో 8 ఎకరాల చెరకు తోట (Sugarcane Crop) పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు కోర్స కిర్య, ఆయన సోదరుడు కోర్స రమేష్ చెరో నాలుగు ఎకరాల చొప్పున మొత్తం 8 ఎకరాల్లో చెరకు సాగు చేశారు. అయితే ఆదివారం సాయంత్రం సమయంలో తోట మధ్యలో నుంచి పొగలు వస్తుండటాన్ని గమనించిన సమీపంలోని రైతులు వెంటనే తోట యజమానులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

వెంటనే అక్కడికి చేరుకున్న రైతులు మంటలను ఆర్పేందుకు విఫలయత్నం చేశారు. అప్పటికే మంటలు తీవ్రంగా వ్యాపించగా, కొత్తగూడెం నుంచి అగ్నిమాపక శకటం సంఘటనా స్థలానికి చేరుకునే లోపే 8 ఎకరాల చెరకు తోట పూర్తిగా అగ్నికి ఆహుతైంది. మరో 20 రోజుల్లో కోతకు రావాల్సిన పంట పూర్తిగా దగ్ధం కావడంతో సుమారు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు కన్నీటిపర్యంతమయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>