కలం డెస్క్ : బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుపై (Harish Rao) అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు, కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా సుప్రీంకోర్టులో దాఖలైన కేసు కొత్త తలనొప్పి తీసుకొచ్చింది. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) విషయంలో హరీశ్‌రావును విచారించడానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. దీనికి తోడు హరీశ్‌రావుకు రిలీఫ్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చక్రధర్‌గౌడ్ దాఖలు చేసిన పిటిషన్ కూడా విచారణలో ఉన్నది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌లపై సోమవారం విచారణ జరపనున్నది. గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన హరీశ్‌రావు తన ఫోన్‌ను ట్యాపింగ్ చేయించారని, ఎఫ్ఐఆర్ దాఖలు చేసి విచారణ జరపాలని పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో జి. చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించిన హరీశ్‌రావు.. ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు నుంచి సానుకూల స్పందనే వచ్చింది.
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు :
హైకోర్టు వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ చక్రధర్‌గౌడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు సోమవారం విచారించనున్నది. ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్‌రావుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సైతం విచారణలో ఉండడంతో రెండింటికీ ఉన్న లింకును పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు అటాచ్ చేసింది. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో హరీశ్‌రావుపై (Harish Rao) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగానే తీవ్రమైన ఆరోపణలు చేశారు. దానికి ముందు కల్వకుంట్ల కవిత సైతం ఆరోపణలు చేశారు. కాంట్రాక్టుల అప్పగింతలో ఆర్థికపరంగా అవకతవకలు జరిగాయని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) వేస్తే తగిన ఆధారాలను సమర్పిస్తానని అన్నారు. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయవచ్చని ఊహాగానాలు వస్తున్న సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ విషయమై సుప్రీంకోర్టులో కేసు విచారణకు రావడం గమనార్హం.
Read Also: ‘నరేగా బచావో’ పై సీతక్క దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్.. షెడ్యూల్ ఫిక్స్
Follow Us On : WhatsApp


