epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘నరేగా బచావో’ పై సీతక్క దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్.. షెడ్యూల్ ఫిక్స్

కలం డెస్క్ : ఏఐసీసీ నియమించిన ‘నరేగా బచావో సంగ్రామ్’ (MGNREGA Bachao Sangram) కమిటీలో రాష్ట్ర మంత్రి సీతక్కకు (Seethakka) చోటు లభించింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జరపనున్న ఆందోళనలను సమన్వయం చేయడానికి ఉద్దేశించిన ఈ సమన్వయ కమిటీలో మొత్తం తొమ్మిది మంది ఉంటే అందులో సీతక్క కూడా ఒకరు. యూపీఏ హయాంలో ఉనికిలోకి వచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా తెచ్చిన వీ-జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా తొలుత గొంతెత్తింది సీతక్కే. గాంధీ పేరును పథకం నుంచి తీసేయడంతో పాటు కేంద్రం తన వాటాను తగ్గించి రాష్ట్రాలపై ఆర్థిక భారాన్ని మోపడం ద్వారా పరోక్షంగా స్కీమ్ అమలును అటకెక్కిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు మంత్రిగా పనిచేస్తున్న సీతక్కను జాతీయ స్థాయి సమన్వయ కమిటీలో చేర్చడం గమనార్హం.

ఫిబ్రవరి 25 వరకు ఆందోళనలు :

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి ఆందోళనలకు షెడ్యూలు ఖరారు చేసింది. నరేగా బచావో సంగ్రామ్ పేరుతో జరిగే ఈ ఆందోళనలు గ్రామ స్థాయి నుంచి జోనల్ స్థాయి వరకు వివిధ ప్రాంతాల్లో జరగనున్నాయి. ఈ ఆందోళనల అమలు, పర్యవేక్షణ, సమన్వయం కోసం ఏఐసీసీ ప్రత్యేకంగా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. గ్రామీణ పేదలు, కూలీల హక్కుల పరిరక్షణకు జరుగుతున్న ఈ జాతీయ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్కతో (Seethakka) పాటు సీనియర్ నేతలు అజయ్ మాకెన్ (కన్వీనర్‌), జైరాం రమేష్, సందీప్ దీక్షిత్, డాక్టర్ ఉదిత్ రాజ్, ప్రియాంక్ ఖర్గే, దీపికా పాండే సింగ్, డాక్టర్ సునీల్ పన్వర్, మనీష్ శర్మ కూడా ఉన్నారు. గ్రామీణ భారతంలోని కోట్లాది మంది కూలీ కార్మికుల ఉపాధి హక్కులను కాపాడే లక్ష్యంతో ఈ ఆందోళనలు దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమంగా సాగనున్నాయి.

ఏఐసీసీ షెడ్యూలు ఇదే :

జనవరి 8 : పీసీసీ స్థాయిలో సన్నాహక సమావేశాలు
జనవరి 10 : జిల్లా స్థాయిలో మీడియా సమావేశాలు
జనవరి 11 : నిరసనకు గుర్తుగా ఒక రోజు నిరాహార దీక్షలు
జనవరి 12-29 : గ్రామ పంచాయతీల్లో రచ్చబండ సమావేశాలు, సర్పంచ్ సహా వివిధ స్థాయిల్లోని ప్రజా ప్రతినిధుల ప్రసంగాలు, కరపత్రాల పంపిణీ, ఉపాధి హామీ కార్మికులకు కొత్త-పాత చట్టంల తేడాలపై అవగాహనా సదస్సులు, సోనియాగాంధీ-రాహుల్‌గాంధీ-మల్లికార్జున ఖర్గే సందేశాలను ప్రజలకు వినిపించడం.
జనవరి 30 : అన్ని గ్రామాల్లో శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు
జనవరి 31 – ఫిబ్రవరి 6 : జిల్లా స్థాయిలో నరేగా బచావో ధర్నాలు
ఫిబ్రవరి 7-15 : రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఘెరావో ఆందోళనలు
ఫిబ్రవరి 16-25 : జోనల్ స్థాయిలో ఏఐసీసీ ర్యాలీలు

Seethakka
Seethakka in MGNREGA Bachao Sangram Committee

Read Also: నల్లమలసాగర్ ప్రాజెక్టుపై లాయర్లతో చర్చలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>