కలం, నల్లగొండ బ్యూరో: దేవరకొండ (Devarakonda) పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో జరిగిన రూ. 2.65 కోట్ల భారీ మోసం కేసును నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హౌస్ కీపింగ్ ఉద్యోగితోపాటు సూర్యాపేట ఎస్‌బీఐ మేనేజర్, మరో ఇద్దరు సహ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2.42 కోట్ల నగదు, ల్యాప్‌టాప్, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. దేవరకొండ ఎస్‌బీఐ (SBI) బ్రాంచ్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన హౌస్ కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న లెండల చక్రపాణికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉంది. బ్యాంక్ సిబ్బందికి సహాయం చేసేవాడు. ఈ క్రమంలో బ్యాంక్ అంతర్గత వ్యవస్థలపై అవగాహన పెంచుకున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కేందుకు సూర్యాపేట ఎస్‌బీఐ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులుతో కలిసి పథకం వేశాడు. మేనేజర్ రామాంజనేయులు తన అధికార పరిధిలోని ఎంఐఎస్ సిస్టమ్ ద్వారా ఏళ్ల తరబడి లావాదేవీలు జరగని (ఇన్ యాక్టివ్) 10 బ్యాంక్ ఖాతాలను గుర్తించాడు. నిందితులు ఆ ఖాతాదారుల వివరాలు సేకరించారు.
ఆన్‌లైన్ సైట్ల ద్వారా నకిలీ ఆధార్, పాన్ కార్డులను తయారు చేశారు. రద్దీగా ఉన్న సమయంలో బ్యాంక్ ఉద్యోగుల ఐడీలతో లాగిన్ అయి, ఆ ఖాతాలకు నిందితుల మొబైల్ నంబర్లను లింక్ చేశారు. యోనో యాప్ ద్వారా కొత్త పిన్ సృష్టించి, ఆ ఖాతాల్లోని దాదాపు రూ. 2.65 కోట్లను ఇతర వ్యక్తుల ఖాతాలకు మళ్లించారు. అయితే హైదరాబాద్‌లోని కోటి బ్రాంచ్‌కు చెందిన పల్లటి నరేందర్ అనే వ్యక్తి ఖాతాలో అక్రమంగా కేవైసీ అప్‌డేట్ చేసినప్పుడు, అతనికి ఈ-మెయిల్ ద్వారా అలర్ట్ వెళ్లింది. దీనిపై అతను బ్యాంక్ అధికారులను సంప్రదించడంతో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు, దేవరకొండ ఎస్‌బీఐ హౌస్ కీపింగ్ ఉద్యోగి లెండల చక్రపాణి (25), సూర్యాపేట ఎస్‌బీఐ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులు (37), ఎస్‌బీఐ రికవరీ ఏజెంట్ కేతావత్ రాంలాల్ (35), ఫోటోగ్రాఫర్ మారేపల్లి శివ (31)లను అరెస్టు చేశారు. పోలీసులు నిందితుల నుంచి రూ. 1,10,60,000 నగదును నేరుగా, వివిధ బెనిఫిషియరీ ఖాతాల నుండి రూ. 1,31,50,000 మొత్తాన్ని రికవరీ చేశారు. మొత్తంగా రూ. 2,42,10,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. దేవరకొండ డీఎస్పీ ఎం.వి. శ్రీనివాస రావు పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ పి. వెంకట్ రెడ్డి, బృందం ఈ కేసును వేగంగా ఛేదించారు. సమర్థవంతంగా పనిచేసిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు.
Read Also: ఇక బాంబ్ ల వర్షమే.. డొనాల్డ్ ట్రంప్ డెడ్లీ వార్నింగ్
Follow Us On: Instagram

