కలం, సత్తుపల్లి: ప్రముఖ రైతు నేత, సీపీఎం సీనియర్ నాయకుడు, కిసాన్ సభ మాజీ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి (Saramapalli Malla Reddy) హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మృతికి సంతాపంగా సత్తుపల్లి పట్టణంలో సీపీఎం పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, ఇతర నాయకులు మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సభలో నాయకులు మాట్లాడుతూ.. గ్రామం నుంచి జాతీయ స్థాయి వరకు తెలంగాణ రైతాంగ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో మల్లారెడ్డి కీలక పాత్ర పోషించారని కొనియాడారు. పేదలు, దళితుల భూముల పరిరక్షణ, సాగునీరు, వ్యవసాయ సంక్షోభంపై జీవితాంతం పోరాటాలు సాగించారని కొనియాడారు. పుస్తకాల ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించారని గుర్తు చేశారు. ఆయన మృతి వామపక్ష, రైతాంగ ఉద్యమాలకు తీరని లోటని, మల్లారెడ్డి ఆశయాలను, పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి పేర్కొన్నారు.

