కలం, కరీంనగర్ బ్యూరో: ధర్మపురి మండలంలోని నాగారం, కమలాపూర్ గ్రామాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri) విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగారం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులు సుమారు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సంఘ భవనానికి మంత్రి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో పాటు రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధిని మరింత వేగవంతం చేయవచ్చన్నారు. నూతనంగా నిర్మించనున్న మహిళా సంఘ భవనం పూర్తయిన తర్వాత స్థానిక మహిళా సంఘాల సమావేశాలు, వివిధ కార్యకలాపాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
అనంతరం కమలాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి తెలిపారు.

